ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో శుక్రవారంనాడు మంటలు చెలరేగాయి. దీంతో రైలును బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య రైలును నిలిపివేశారు.
భువనగిరి: ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో శుక్రవారంనాడు మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి -పగిడిపల్లి మధ్య ఫలక్ నుమా రైలును నిలిపి వేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా రైలులో మంటలు వ్యాపించినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. మంటలను గుర్తించిన ప్రయాణీకులు వెంటనే రైలు నుండి దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైలులో మంటల కారణంగా దట్టంగా పొగ వ్యాపించింది. ఈ మంటల్లో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన ఐదు బోగీలు దగ్దమయ్యాయి. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఫైరింజన్లు వచ్చేందుకు రహాదారి సౌకర్యం లేదు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోకి ఫైరింజన్ వచ్చింది. సంఘటన స్థలానికి ఫైరిజంన్ రావడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ రైలులో సుమారు 1500 మంది ప్రయాణీకులున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఈ ప్రమాదంపై రైల్వేశాఖాధికారులు విచారణ చేస్తున్నారు.ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు 80 నుండి వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. భువనగిరికి సమీపంలో రైలు స్పీడ్ తగ్గిన సమయంలో ఈ మంటలను గుర్తించారు.
ఈ రైలులోని ఎస్ 3, ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6 ,ఎస్ 7, బోగీలు దగ్ధమయ్యాయని సమాచారం. మరో రెండు బోగీలు పాక్షికంగా దగ్ధమయ్యాయి.ఈ ప్రమాదం గురించిన సమాచారం అందిన వెంటనే దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సంఘటన స్థలానికి బయలుదేరారు.హారా నుండి సికింద్రాబాద్ కు ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరో గంట సేపట్లో ప్రయాణీకులు తమ గమ్యస్థానానికి చేరుకొనే సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
మంటలు వ్యాపించిన బోగీలతో ఇతర బోగీలకు ఉన్న లింక్ ను తొలగించారు. దీంతో ఇతర బోగీలకు మంటలు వ్యాపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చార్జింగ్ పాయింట్ వద్ద ఓ ప్రయాణీకుడు సిగరెట్ తాగడం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని ఈ రైలులో ప్రయాణించిన ప్రత్యక్షసాక్షి ఒకరు మీడియాకు తెలిపారు.ఎస్ 4 బోగీలో తొలుత మంటలు వ్యాపించినట్టుగా ప్రయాణీకులు చెబుతున్నారు. మంటలు వ్యాపించిన బోగీల్లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రయాణీకులున్నారు.
అగ్ని ప్రమాదానికి గురైన ఆరు బోగీలను మినహాయించి ఇతర బోగీలతో రైలు సికింద్రాబాద్ కు బయలుదేరింది. మరో వైపు ఈ ప్రమాదం కారణంగా ఆరు బోగీల్లోని ప్రయాణీకులను సికింద్రాబాద్ కు తరలించేందుకు ప్రత్యేకంగా రైలును పంపారు అధికారులు. మరో వైపు ఆరు ఆర్టీసీ బస్సులను కూడ రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.
వారంక్రితమే బాలాసోర్ తరహా ప్రమాదం జరుపుతామని రైల్వే శాఖకు బెదిరింపు లేఖ
బాలాసోర్ తరహా ప్రమాదం జరుగుతుందని ఇటీవలనే దక్షిణ మద్య రైల్వే శాఖకు బెదిరింపు లేఖ అందింది. ఈ లేఖ విషయమై నార్త్ జోన్ పోలీసులకు దక్షిణ మధ్య రైల్వే శాఖాధికారులు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా నార్త్ జోన్ పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ- హైద్రాబాద్ మార్గంలో ఈ ప్రమాదం జరుగుతుందని ఆ లేఖలో వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ జరిగిన ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా, ఇతరత్రా కారణాలా అనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.
టోల్ ఫ్రీ నెంబర్ల ఏర్పాటు చేసిన రైల్వే శాఖ
ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం కోసం రైల్వే శాఖ టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసింది. 36912, 82819 టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదం కారణంగా రెండు రైళ్లను రద్దు చేశారు. మరో నాలుగు రైళ్లను దారి మళ్లించారు.