అర్థరాత్రి వనస్థలిపురంలోని సుబ్బయ్యగారి హోటల్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోగా 40 మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.
హైదరాబాద్ : గత అర్ధరాత్రి హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వనస్థలిపురం చింతలకుంటలోని సుబ్బయ్యగారి హోటల్లో ఒక్కసారిగా మంటలు చేలరేగి హోటల్ మొత్తాన్ని వ్యాపించాయి. హోటల్ భవనంలోని రెండో అంతస్తులో హోటల్ కొనసాగుతుండగా మూడో అంతస్తులో సిబ్బంది వుంటున్నారు. మంటలు రెండో అంతస్తులో చెలరేగడంతో కిందకు రాలేక దాదాపు 40మంది హోటల్ సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పోలీసులు సమచారం అందించారు.
వెంటనే స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోగా అప్పటికే రెండో అంతస్తులో మంటలు చెలరేగుతున్నాయి. దీంతో మూడో అంతస్తులోని సిబ్బందిని కాపాడేందుకు వారు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండానే 40మందికి పైగా హోటల్ సిబ్బందిని పోలీస్, అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ప్రాణభయంతో వున్న తమను సురక్షితంగా కాపాడినవారికి హోటల్ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అగ్నిప్రమాదం నుండి హోటల్ సిబ్బందికి కాపాడిన పోలీసులను స్థానికులు ప్రశంసిస్తున్నారు. స్థానిక ఇన్స్పెక్టర్ జలంధర్ రెడ్డితో పాటు సహాయకచర్యల్లో పాల్గొన్ని పోలీస్ సిబ్బందిని కూడా ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు.
Read More కరెంట్ మీటర్ లో సీక్రెట్ కెమెరా.. అమ్మాయిలను గమనిస్తూ యజమాని పైశాచికానందం...
షాట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. అర్థరాత్రి హోటల్ మూసివేసి వుండటంతో హోటల్ మొత్తం మంటలు వ్యాపించేవరకు ఎవ్వరూ గమనించలేదు. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు మంటలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఇదిలావుంటే రెండ్రోజులక్రితం బోనాల పండగరోజు సికింద్రాబాద్ లో ఇలాగే భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాలికాబజార్ లోని ఓ వస్త్ర దుకాణంలో తెల్లవారుజామున మంటలు చెలరేగి షాప్ మొత్తం వ్యాపించాయి. ఈ మంటలు ఇతర షాప్ లకు వ్యాపించకుండా జాగ్రత్తపడ్డ ఫైర్ సిబ్బంది ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. అనంతరం నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపుచేసాయి. ఈ అగ్నిప్రమాదం కూడా షాట్ సర్క్యూట్ కారణంగానే జరిగింది.