Harish Rao: ఆ లోపు ప్ర‌తి జిల్లాలో ద‌ళిత బంధు అమలు చేస్తాం.. : హ‌రీష్ రావు

By Rajesh KFirst Published Jan 23, 2022, 4:22 PM IST
Highlights

Harish Rao: రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మార్చి 31 లోపు  100 మంది చొప్పున లబ్ధిదారులకు దళిత బంధు అమలు చేస్తామని హరీశ్​ అన్నారు. సంగారెడ్డిలో దళిత బంధు పథకంపై ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. అత్యంత పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక ఉండాలని సూచించారు.
 

Harish Rao: తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్ర‌భుత్వం మొండి వైఖరితో ఉంద‌ని, ఆ వైఖ‌రి మార్చుకోవాలని మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయం నుండి ప్రతీ విషయంలో రైతులకు మోసమే చేస్తోందని ఆరోపించారు. మార్చి 31 లోపు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో 100 మందికి దళితబంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఈ మేరకు సంగారెడ్డిలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో మంత్రి హరీశ్​ రావు సమీక్ష నిర్వహించారు.  హుజురాబాద్ ఎన్నికల తర్వాత దళితబంధు ఉండదు అన్న ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. దళితబంధుకు వచ్చే బడ్జెట్ నుంచి నిధుల కేటాయిస్తామని అన్నారు. 

అధికారులు గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులను ఎంపిక చేస్తారనీ, ఫిబ్రవరి తొలి వారంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి అవుతుంద‌నీ తెలిపారు. మార్చి మొదటి వారంలోగా యూనిట్లను గ్రౌండ్ చేయాలనీ, మార్చి 31 లోగా ప్రతి నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేస్తాంమ‌ని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ప్రజాప్రతినిధులు పాల్గొనాల‌ని పిలుపును ఇచ్చారు. 2 నెలల సమయమే ఉన్నందున ప్రయోగాత్మకంగా ఒకట్రెండు గ్రామాల్లో అమలు చేస్తున్నామని తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో దళిత బంధుకు పెద్దఎ త్తున నిధులు కేటాయిస్తామని హరీశ్​ వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దళిత బంధును అమలు చేస్తామని తెలిపారు.  

ఈ ప్ర‌క్రియ‌లో పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక చేయాల‌ని సూచించారు.   దళితబంధుపై ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేశారనీ, ఎన్నికలు ఉంటేనే పథకాలు గుర్తొస్తాయని ఆరోపించారని, ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా ఎన్నికలు లేవని,  సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీని నెర‌వేర్చుతున్నార‌ని హరీశ్ రావు తెలిపారు.  ఈ త‌రుణంలో బీజేపీని టార్గెట్ చేస్తూ విరుచుక‌ప‌డ్డారు. బీజేపీ ‘మిషన్ కాకతీయ’ పథకాన్ని కాపీ చేసి ‘హర్ గర్ జల్’ పేరుతో దేశంలో ప్రవేశపెట్టారన్నారు. అలాగే దళితబంధు లాంటి పథకాన్ని కూడా దేశ వ్యాప్తంగా అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. 

అలాగే.. విద్యావిధానం మీద మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 53 రెసిడెన్షియల్ ఎస్సీ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి పెట్టి ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తుందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మన ఊరు మన బడి పథకంతో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు కొత్త రూపం తీసుక‌వ‌స్తామని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా తెలంగాణాలో టీచర్లు ఉన్నారని, అందుకే కేంద్ర గణాంకాలే నిదర్శనమన్నారు. త్వరలో 20 వేల  టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హ‌రీష్ రావు అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన 21 నవోదయ పాఠశాలు తీసుకురావాలని బండి సంజయ్‌కు సవాల్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

click me!