కర్రలు, హాకీ స్టిక్స్ లతో టీఆర్ఎస్ నాయకుల వీరంగం.. డిప్యూటీ మేయర్ కు గాయాలు.. !!

Published : Aug 13, 2021, 09:31 AM IST
కర్రలు, హాకీ స్టిక్స్ లతో టీఆర్ఎస్ నాయకుల వీరంగం.. డిప్యూటీ మేయర్ కు గాయాలు.. !!

సారాంశం

పవన్, అతడి అనుచరులు జరిపిన దాడిలో 35వ డివిజన్ కార్పొరేటర్ భర్తతో పాటు, దాడిని అడ్డుకోవడనికి ప్రయత్నించిన డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి స్వల్ప గాయాలయ్యాయి. 

సరూర్ నగర్ : మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ కార్పొరేషన్ అధికార టీఆర్ఎస్ లో విబేధాలు భగ్గుమన్నాయి. మేయర్ భర్త దీప్ లాల్ చౌహాన్, డిప్యూటీ మేర్ విక్రమ్ రెడ్డి తమ పార్టీ కార్పొరేటర్లతో కలిసి రాత్రి 8 గంటలకు జిల్లెల గూడలోని ఓ ప్రైవేటు స్కూల్ లో సమావేశమై, శుక్రవారం జరగనున్న కౌన్సిల్ మీటింగ్ పై చర్చించుకుంటున్నారు. 

అదే సమయంలో సొంతపార్టీకి చెందిన 10వ వార్డు కార్పొరేటర్ పవన్ కుమార్, ఆయన అనుచరులు (దాదాపు 30 మందికి పైగా యువకులు) అక్కడకు చేరుకుని వీరంగం సృష్టించారు. కార్లు, ద్విచక్ర వాహనాలమీద వచ్చిన సదరు యువకులు తమ వెంట తెచ్చుకున్న కర్రలు, హాకీ స్టిక్స్ తో సమావేశంలోని నాయకులపై విరుచుకుపడ్డారు. దాంతో కొంత సేపు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. 

విషయం తెలియక కొందరు కార్పొరేటర్లు అయోమయంగా చూస్తుండి పోయారు. పవన్, అతడి అనుచరులు జరిపిన దాడిలో 35వ డివిజన్ కార్పొరేటర్ భర్తతో పాటు, దాడిని అడ్డుకోవడనికి ప్రయత్నించిన డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి స్వల్ప గాయాలయ్యాయి. 

కార్పొరేటర్ పవన్ కుమార్ జిల్లెల గూడ చందచెరువు సుందరీకరణ కాంట్రాక్ట్ తీసుకుని, దాదాపు రూ. 4 కోట్ల విలువైన పనులు చేశారు. ఇప్పటివరకు సగం బిల్లు మాత్రమే విడుదల కాగా, మిగతా సగం కూడా ఇవ్వాలంటూ ఆయన పట్టుబడుతున్నట్టు సమాచారం. అయితే అంత పెద్ద మొత్తం కాంట్రాక్టులో తమకు పర్సంటేజీ కావాలంటూ కొందరు తోటి కార్పొరేటర్లు అతడిని డిమాండ్ చేసినట్టు తెలిసిది. 

పర్సంటేజి ఇవ్వకపోతే బిల్లు విడుదల చేసేది లేదంటూ అడ్డుతగిలినట్టు తెలిసింది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం  ఎన్ వైఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసుకున్న అంతర్గత సమావేశంలోనూ ఇదే అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. తనకు బిల్లు రాకుంగా అడ్డుకుంటున్నారనే కోపంతో కొందరు కార్పొరేటర్లను ఇటీవల పవన్ నేరుగా బెదిరించినట్టు ఆరోపణలున్నాయి. తాజాగా శుక్రవారం జరగబోయే కౌన్సిల్ సమావేశం జరగనుండగా, ఎజెండాలోని అంశాలపై చర్చించుకునే నిమిత్తం గురువారం రాత్రి  ఓ కార్పొరేటర్ కు చెందిన స్కూల్ లో సమావేశమయ్యారు. 

తనకు సమాచారం ఇవ్వకుండా మీటింగ్ ఏర్పాటు చేసుకుని, తన బిల్లులు విడుదల కాకుండా కుట్రలు పన్నుతున్నారనే ఆగ్రహంతో పవన్‌కుమార్‌ తన అనుచరగణంతో అక్కడకు చేరుకుని దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. యువకులంగా హాకీ స్టిక్స్, కర్రలతో అక్కడున్న కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్ల భర్తలపై విరుచుకుపడ్డారు అని బాధితులు ఆరోపిస్తున్నారు. ఓ కార్పొరేటర్ భర్తను కింద పడేసి కాళ్లతో తొక్కినట్టు తెలిపారు.

స్కూల్ లోని ఫర్నిచర్ ను, సమావేశంలోని కుర్చీలను ధ్వంసం చేశారు. సర్దిచెప్పడానికి ప్రయత్నించిన డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డిపైనా కుర్చీలు విసిరేశారు. దాంతో ఆయన ముక్కుకు గాయమై రక్తం వచ్చింది. కొందరి దుస్తులు చిరిగిపోయాయి. ఈ సఘటనతో మీర్ పేట్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పవన్, ఆయన అనుచరులు పదినిమిషాల పాటు వీరంగం సృష్టించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఇన్ స్పెక్టర్ మహేందర్ రెడ్డి వెంటనే సంఘటనా స్థలానిక చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మేయర్ భర్త, డిప్యూటీ మేయర్‌, బాధిత కార్పొరేటర్లు కలిసి పీఎస్ కు చేరుకున్నారు. టీఆర్ఎస్ నేతలు సైతం పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. 

అదికార పార్టీ కార్పొరేటర్ల మధ్య జరిగిన ఈ దాడి నేపథ్యంలో శుక్రవారం నిర్వహించ తలపెట్టిన కౌన్సిల్ మీటింగ్ ను వాయిదా వేయాలని కొందరు కార్పొరేటర్లు వాదిస్తున్నట్లు తెలిసింది. ఇంత పెద్ద గొడవ జరిగిన తర్వాత కూడా సమావేశం పెట్టుకుని ఏం చర్చించగలమని కొందరు కార్పొరేటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమలో కౌన్సిల్ సమావేశం వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

జరిగిన సంఘటనమీద బాధితుల్లోని ముగ్గురు కార్పొరేటర్లు వేర్వురుగా ఫిర్యాదులు చేశారు. కులం పేరుతో దూషించినట్టుగా ఒకరు, అకారణంగా దాడి చేశారంటూ ఇద్దరు కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు.  వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించి విచారణ జరుపుతున్నామని ఇన్‌స్పెక్టర్‌ మహేందర్ రెడ్డి చెప్పారు. మొత్తం మీద మీర్ పేట్ లోని అధికార పార్టీలో చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనిమీద మంత్రి సబితారెడ్డి ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu