
హుజూర్నగర్ : పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చిందని చిన్నపుడు కథలు చదువుకున్నాం.. కానీ.. ఇప్పుడా పిల్లే డైలమాలో పడింది. తను ఎవరికి చెందుతుందో.. ఎవరు తనను పెంచుతారో తెలీక అమాయకంగా మ్యావ్ మ్యావ్ అంటూ పోలీస్ స్టేషన్ లో తిరుగుతోంది. ఈ విచిత్రమైన కేసు సూర్యాపేటలో వెలుగులోకి వచ్చింది.
cat కోసం గొడవపడి రెండు వర్గాలు policestation కు చేరిన ఘటన సూర్యాపేట జిల్లా Huzurnagarలో మంగళవారం చోటు చేసుకుంది. బానోతు చుక్కమ్మ అనే మహిళ ఫణిగిరి రామస్వామి గుట్ట వద్ద ఉన్న కాలనీలో నివసిస్తుంది. కొంతకాలం కిందట ఆమెకు స్థానిక చైతన్య డిగ్రీ కళాశాల పరిసరాల్లో ఒక పిల్లి దొరికింది. దానిని ఇంటికి తీసుకెళ్ళి పెంచుతోంది. నాలుగు రోజుల కిందట రామస్వామిగుట్ట వద్ద జరిగిన జాతరలో పలువురు ఆ పిల్లిని ఆసక్తిగా చూశారు.
ఇటీవలి కాలంలో జనాలు కుక్కలు పెంచుకోవడం మీదినుంచి కాస్త దృష్టి మరల్చినట్టున్నారు. అందమైన రకరకాల పిల్లుల్ని వేల రూపాయలు పెట్టి మరీ కొంటున్నారు. వాటిని గారంగా పెంచుతూ మురిసిపోతున్నారు. ఈ పిల్లీ అలాంటి కోవకే చెందింది. అయితే ఈ విషయం దొరికిన పిల్లిని పెంచుతున్న సుక్కమ్మకు తెలియకపోవచ్చు. ఏదో ముద్దుగా ఉంది కదా అని తెచ్చి పెంచుకుంటోంది. ఊర్లోవాళ్లు మెచ్చుకుంటే మురిసిపోతోంది. ఇంతలో..
ఈ క్రమంలో ఆ పిల్ల తమదేనని రెండేళ్లపాటు పెంచుకున్నాక ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని స్థానిక విగ్నేశ్వర స్వామి ఆలయం సమీపంలోని దద్దనాల చెరువు కాలనివాసి మద్దెల ముత్యాలు కుటుంబ సభ్యులు గుర్తించారు. సుక్కమ్మ ఇంటికి వెళ్లి తన పిల్లిని ఇవ్వమని అడిగారు. ఆమె పిల్లిని ఇవ్వడానికి ఇష్టపడలేదు. స్టీల్ సామాను వ్యాపారం కోసం మైసూర్ వెళ్లినప్పుడు పిల్లల కోసమని రూ.5000 పెట్టి ఆ పిల్లిని కొన్నానని ముత్యాలు తెలిపారు.
దీన్ని సుక్కమ్మ నమ్మలేదు. నిజమే కదా.. ఎక్కడపడితే అక్కడ ఉండే పిల్లి వాళ్లదెలా అవుతుంది అనుకుందేమో. అందుకే ఈ పిల్లి మీదే నని రుజువేంటి అని గొడవకు దిగింది. ఆ పిల్లిని వేల రూపాయలు పోసి తామే కొన్నామని ముత్యాలు వాదించాడు. డబ్బులు పెట్టకపోతే అంతదూరం వచ్చి గొడవకు ఎందుకు దిగుతాడు.. నిజమే కదా.. సరే ఏది నిజమో.. ఏది అబద్దమో కానీ.. ఇద్దరూ పిల్లిని పెంచిన మాట వాస్తవమే.. ఇద్దరూ దానితో అనుబంధం పెంచుకున్న మాట నిజమే అనిపిస్తుంది చూస్తుంటే..
ఇలా ఇరువర్గాలు ఘర్షణ పడుతుంటే.. ఊరుమొత్తం అక్కడే పోగయ్యింది.. వారి గొడవను విచిత్రంగా చూసింది. అంతేకాదు పిల్లిని ఇచ్చేయమని సోమవారం ముత్యాలు తరఫువారు తనపై దాడి చేసి తన ఫోన్ పగలగొట్టారని సుక్కమ్మ చెప్పింది. దీంతో ఈ గొడవ కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఇరువర్గాలు ఈ విషయమై పోలీసులకు పరస్పర ఫిర్యాదు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్లో సుమారు రెండు వర్గాల జనం 50 మందికి పైనే జమయ్యారు. దీంతో ఇరువర్గాలను మంగళవారం ఠాణాకు పిలిచిన పోలీసులు సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.