
సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని Mallanna Sagar రిజర్వాయర్ ను తెలంగాణ సీఎం KCR బుధవారం నాడు ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న రిజర్వాయర్లలో మల్లన్నసాగర్ అతి పెద్ద రిజర్వాయర్ .
ప్రపంచంలోనే అతి పెద్దదైన ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం తుదిదశకు చేరుకొంది. ముఖ్యంగా మల్లన్నసాగర్ తెలంగాణకు గుండెకాయ.kaleshwaram ప్రాజెక్టులోనే అత్యధిక నీటి నిల్వ సామర్థ్యమున్న, అత్యంత ఎత్తున ఉన్న జలాశయం మల్లన్నసాగర్. సిద్దిపేట జిల్లాలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయానికి 5 ఓటీ స్లూయిస్ లను ఏర్పాటు చేశారు. ఆ తూముల ద్వారానే కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్‌కు, సింగూరు ప్రాజెక్టుకు, తపాస్‌పల్లి రిజర్వాయర్ కు, మిషన్ భగీరథకు నీటిని తరలిస్తారు.మల్లన్నసాగర్ ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు ఓ వరప్రదాయిని. అందుకే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం DPRలో మల్లన్నసాగర్‌ను మదర్ రిజర్వాయర్ గా పేర్కొన్నారు.
మల్లన్నసాగర్ రిజర్వాయర్ FRL 535 మీటర్లు. దీంతో మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు కేవలం గ్రావిటీ ద్వారా జలాల్ని తరలించే వెసులుబాటు లభించింది. మల్లన్నసాగర్ కింద 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్యాకేజీ-13 కింద మల్లన్నసాగర్ నుంచి 8.733 కిలోమీటర్ల మేర నిర్మించే గ్రావిటీ కాల్వ ద్వారా 53వేల ఎకరాలు సాగు కానున్నది. ప్యాకేజీ-17, 18, 19 కింద 11.670 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ తో11.525 కిలోమీటర్ల టన్నెల్ ఆపై మరో 2.505 గ్రావిటీ కాల్వ ద్వారా గోదావరి జలాల్ని హల్దీ నదిని దాటిస్తారు. అవసరమైతే అక్కడ నేరుగా హల్దీ నదిలోకి కూడా గోదావరిజలాల్ని పోసే వెసులుబాటు ఉంటుంది.
ఆపై 34 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, 3.65 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణంతో జలాలు మంజీరా నదిని దాటుతాయి. అక్కడి నుంచి 37.900 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా సింగూరు రిజర్వాయర్ సమీపంలోని ముదిమానిక్ తండా వద్ద నిర్మించే పంపుహౌజ్ వరకు తరలిస్తారు. ప్యాకేజీ-18 కింద 15వేల ఎకరాలు, ప్యాకేజీ-19 కింద 1.17 లక్షల ఎకరాలకు సాగునీరు అందనునుంది.
మల్లన్నసాగర్ నుంచి 8.175 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా 530 కాంటూర్ వద్ద నిర్మించే ఆనకట్ట దగ్గరకు గోదావరి జలాల్ని తరలిస్తారు. అక్కడ నుంచి నల్లగొండ జిల్లాలో నిర్మించే గంధంమల్ల రిజర్వాయర్ కు గోదావరి జలాల్ని తరలిస్తారు. ఈ క్రమంలో ప్యాకేజీ-15 కింద 55వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
అదే మార్గంలో జలాల్ని ప్యాకేజీ-16 ద్వారా 11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే బస్వాపూర్ రిజర్వాయర్ కు నీటిని అందిస్తారు. తద్వారా ఈ ప్యాకేజీ కింద 1.88 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. దీనితో పాటు ఆనకట్ట నుంచి ప్యాకేజీ-14 కింద 4.850 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా 8.950 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం ద్వారా జలాల్ని కొండపోచమ్మ రిజర్వాయర్ సమీపంలో మెదక్ జిల్లా వర్గల్ మండలం పాములపర్తి వద్ద నిర్మించే పంపుహౌజ్ వరకు తరలిస్తారు. ప్యాకేజీ-14 ద్వారా గ్రావిటీపైనే 2.27 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. పాములపర్తి దగ్గర కేవలం 89 మీటర్ల మేర మాత్రమే లిఫ్టు ఉంది. ఇలా మొత్తంగా దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలకు గ్రావిటీపై సాగునీరు అందించవచ్చు.
రాష్ట్రంలోనే ఎస్సారెస్పీ తర్వాత అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్. దీని కెపాసీటీ 50 టీఎంసీలు. బహుళ ప్రయోజనాలు కలిగిన ఈ జలాశయంతో ఉమ్మడి మెదక్ తో పాటు ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. కొండపోచమ్మ, గంధమల్ల, బస్వాపూర్ , నిజాంసాగర్, సింగూరు, తపాస్ పల్లి, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు ఇక్కడి నుంచే గోదావరి జలాలను తరలిస్తారు. హైదరాబాద్ తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీటిని ఏడాది పొడవునా అందిస్తారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్ కు అక్కడి నుంచి ఓపెన్ కెనాల్, సొరంగం ద్వారా మల్లన్నసాగర్ లోకి గోదావరి జలాలు వస్తాయి.