జగిత్యాల నియోజకవర్గం బోర్నపల్లి గ్రామానికి చెందిన 9 మంది వ్యవసాయ కూలీలు గోదావరి నదిలో చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ వారిని రక్షించాల్సిందిగా అధికారులు, ఎమ్మెల్యే, మంత్రులను ఆదేశించారు.
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గం బోర్నపల్లి గ్రామానికి చెందిన 9 మంది వ్యవసాయ కూలీలు బోర్నపల్లి శివారులోని కుర్రు ప్రాంతంలో గోదావరి నది మధ్యలో చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ రవి, ఎస్పీ సింధూ శర్మ, జిల్లా అధికార యంత్రాంగం సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తరపున వ్యవసాయ కూలీలను కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుంటున్నాయని.. గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను హెచ్చరిస్తున్నారని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సూచనలను ఏమాత్రం పట్టించుకోకుండా.. యధావిధిగా పనులకు వెళ్లడంతో వ్యవసాయ కూలీలు గోదావరిలో చిక్కుకుపోయారని ఆయన తెలిపారు.
undefined
భారీ వర్షాలకు గోదావరి వరద నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిందని సంజయ్ కుమార్ వెల్లడించారు. మహారాష్ట్రలో సైతం భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ కు వరద పోటెత్తుతోందన్నారు. నదిలో చిక్కుకుపోయిన వారిని బోర్నపల్లికి చెందిన రఘునాథ్, రంగారావు, దేవిధాన్, సాహెబ్ రావు, విజయ్, కార్తీక్, సత్యభామ, సునీత, వైజయంతిలుగు గుర్తించారు. వరద పెరగడంతో రైతులు ఆందోళనకు గురై.. తమను రక్షించాలని వారు అధికారులకు సమాచారం అందించారు.