
మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (etela rajender) కుటుంబ యాజమాన్యంలోని జమునా హ్యాచరీస్ ( jamuna hatcheries) ఆక్రమించిన తమ భూములు వెనక్కి ఇవ్వాలంటూ మెదక్ జిల్లా వెదుర్తిలో బాధితులు ధర్నాకు దిగారు. అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో జమునా హ్యాచరీస్ కబ్జా చేసిన తమ భూములు తిరిగి అప్పగించాలంటూ రైతులు ధర్నా చేశారు. అదే సమయంలో ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి వుండటంతో .. వారిద్దరూ బయటకు రావాలంటూ రైతులు నినాదాలు చేశారు.
ఇకపోతే.. జమునా హ్యాచరీస్ బాధిత రైతులు శుక్రవారం కూడా మెదక్ కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. దళిత, మాల మహానాడు, రజక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు. జమునా హేచరిస్‌కు సంబంధించిన వివాదం గతేడాదిగా నడుస్తూనే వుంది. దీనిపై హైకోర్టులో (telangana high court) కేసు కూడా నడుస్తోంది. ఇప్పటికే దీనిపై సర్వేలు నిర్వహించినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బాధితుల ఆందోళనలపై అధికారులు స్పందించారు. భూముల సర్వే పూర్తయ్యిందని.. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అదనపు కలెక్టర్. ఈ మేరకు బాధితులతో ఫోన్‌లో మాట్లాడారు.
కాగా.. మెదక్ జిల్లా (Medak district ) మూసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో దళితులు, పేదలకు చెందిన అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేశారని కొందరు రైతులు సీఎం కేసీఆర్‌కు (kcr) ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో మంత్రిగా వున్న ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు సీఎం. దీంతో ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి ఈటల రాజీనామా చేశారు. అనంతరం హుజురాబాద్ ఉపఎన్నికలో ఈయన బీజేపీ నుంచి గెలిచారు.