
సరిగ్గా ఓ రెండు సంవత్సరాల క్రితం అనుకుంట... పని చేయకుండా లంచం కావాలంటూ తిప్పించుకుంటోందని హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో విజయారెడ్డిని పెట్రోల్ పోసి తగలబెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంచలనం సృష్టించింది. అచ్చం అలాంటి సీన్ మళ్లీ రీపీట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.
మెదక్ జిల్లాలో తహసీల్దార్‌పై ఓ రైతు డీజిల్ పోయడం కలకలం రేపింది. శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం తాళ్లపల్లి తండాలో మాలోత్ బాలు అనే రైతు కరెంట్ షాక్‌తో మృతిచెందాడు.
తహసీల్దార్ భానుప్రకాశ్ సకాలంలో పట్టా పాసుపుస్తకాలు ఇవ్వలేదని.. ఈ కారణంగానే మాలోత్ బాలుకు బీమా రాలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో మంగళవారం గ్రామానికి చెందిన రైతులు మాలోత్ బాలు మృతదేహం తీసుకుని శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
అయినప్పటికీ తహసీల్దార్ పట్టించుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఓ రైతు తహసీల్దార్ భానుప్రకాశ్‌పై డీజిల్ పోయడం కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని రైతులకు నచ్చజెపుతున్నారు.
కాగా.. ఎమ్మార్వో విజయా రెడ్డి ఘటన తర్వాత.. రెవిన్యూ అధికారులు బాగానే షాకయ్యారు. ఆ ఘటన జరిగి నాటి నుంచి తమకు రక్షణ కల్పించాలని తహసీల్దార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు.