కరీంనగర్ లో ఘోరం... ధాన్యం పక్కన నిద్రిస్తున్న రైతు పైనుండి దూసుకెళ్ళిన ట్రాక్టర్

By Arun Kumar PFirst Published May 27, 2023, 12:10 PM IST
Highlights

పండించిన పంటను కాపాడుకునే క్రమంలో ఓ రైతు తన ప్రాణాలే కోల్పోయిన ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. 

కరీంనగర్ : కష్టపడి పండించిన పంటను కాపాడుకునే ప్రయత్నంలో ఓ రైతు ప్రాణాలు వదిలాడు. ఆరుగాలాలు కష్టపడి పండించిన పంటను అమ్మే క్రమంలో ప్రమాదానికి గురయి రైతు మృతిచెందాడు. కరీంనగర్ జిల్లాలోని ఓ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామానికి చెందిన రైతు ఉప్పులేటి మొండయ్య(65) వయసు మీదపడుతున్నా వ్యవసాయాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఈ వయసులోనూ ఎంతో కష్టపడుతూ పంట పండించేవాడు. ఇలా ఈసారి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు మొండయ్య తిమ్మూపూర్ కొనుగోలు కేంద్రానికి వెళ్లాడు. అయితే అతడి పంట అమ్ముడుపోకపోవడంతో రాత్రి అక్కడే వుండాల్సి వచ్చింది. 

కొనుగోలు కేంద్రంలో కుప్పగా పోసిన ధాన్యానికి కాపలాగా రాత్రి అక్కడే పడుకున్నాడు రైతు మొండయ్య. ధాన్యం కుప్పపై కప్పిన టార్పాలిన్ ను కప్పుకోవడంతో నిద్రిస్తున్న రైతు కనిపించలేదు. దీంతో తెల్లవారుజామున ధాన్యం లోడ్ తో వెళుతున్న ట్రాక్టర్ నిద్రిస్తున్న రైతు నుండి దూసుకెళ్లింది. ఈ క్రమంలో మొండయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.

Read More  బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన లారీ.. స్పాట్‌లోనే ముగ్గురు దుర్మరణం..

కొనుగోలు కేంద్రంలో అన్నదాత మృతిచెందినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఐకెపి కేంద్రానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైతు మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ ను అరెస్ట్ చేసారు. 

ధాన్యాన్ని కాపాడుకునే క్రమంలో అన్నదాత ప్రాణాలు కోల్పోవడం తిమ్మాపూర్  మండలంలో విషాదాన్ని నింపింది. మొండయ్య మృతిచెందినట్లు తెలుసుకుని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. 
 

click me!