ఆదిలాబాద్ జిల్లాలో విషాదం... విత్తనాలు మొలకెత్తలేదని అన్నదాత ఆత్మహత్య

By Arun Kumar PFirst Published Jun 22, 2022, 10:50 AM IST
Highlights

ఈసాారి తన పొలంలో పంట పండక ఎక్కడ నష్టపోతానోనని ఆందోళనకు గురయిన అన్నదాత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

ఆదిలాబాద్:  అతడో సామాన్య రైతు. నేత తల్లిని నమ్ముకుని వ్యవసాయం చేయడం... పండిన పంటను అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకోవడమే అతడికి తెలుసు. ఇలా లాభమో నష్టమో ఇంతకాలం వ్యవసాయమే జీవనాధారంగా బ్రతికాడు.  కానీ ఇప్పుడు కాలం అనుకూలించక అదే వ్యవసాయం కారణంగా అతడు జీవితాన్ని ముగించాడు. ఈసారి వేసిన పంట పండదేమోనన్న మనస్థాపంతో రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

పోలీసులు, బాధిత  కుటుంబం కథనం ప్రకారం... జైనథ్ మడలం మార్గుడ గ్రామానికి చెందిన పడాల నాగన్న(56) అనే రైతు వ్యవసాయమే జీవనాధారంగా బ్రతికేవాడు. ఇలా ఈ ఏడాది కూడా వర్షాకలం మొదలవడంతో వ్యవసాయ పనుల్లో మునిగిపోయాడు. తనకున్న ఏడున్నర ఎకరాల భూమిని పంటవేయడానికి ముందుగానే సిద్దం చేసుకున్న నాగన్న ఈ నెల (జూన్) ఆరంభంలో పత్తి, కంది విత్తనాలు వేసాడు. అయితే అతడు విత్తనాలు వేసిననాటి నుండి వర్షాలు కురవకపోవడంతో ఇంతవరకూ మొలకెత్తలేవు. దీంతో నాగన్న తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. 

ఇప్పటికే భూమిని రెడీచేసుకోడానికి, విత్తనాలు, కూలీలు తదితరాల  కోసం బాగా డబ్బులు ఖర్చు చేసాడు. అయినా కాలం కలిసిరాక ఈ పెట్టుబడి నష్టపోవాల్సి రావడంతో నాగన్న తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే దారుణ నిర్ణయం తీసుకున్నాడు. 

మంగళవారం ఉదయం వ్యవసాయ భూమి వద్దకు ఒంటరిగా వెళ్లిన నాగన్న ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల పొలాలవారు నాగన్న మృతదేహం చెట్టుకు వేలాడటం గమనించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు పొలంవద్దకు చేరుకుని మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. 

బాధిత కుటుంబం సమాచారం అందించడంతో వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు పోలీసులు. మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు నాగన్న భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇక పంటలు సరిగ్గా పండక, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక వ్యవసాయం బారంగా మారీ తెలంగాణలో రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా ఇటీవల సిద్దిపేట జిల్లాలో కూడా ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది.

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం శంకరాయకుంట గ్రామానికి చెందిన ఎర్వ రామస్వామి(55) సన్నకారు రైతు. తనకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ఇటీవల పంటలు సరిగ్గా పండకపోవడంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పుల భారం పెరిగింది. ఇలా రూ.4లక్షల వరకు అప్పు కావడంతో తీవ్ర ఒత్తిడికి గురయిన రామస్వామి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. 

పొలానికి కొట్టడానికి తీసుకువచ్చిన పురుగుల మందు తాగాడు రామస్వామి. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయిన రామస్వామిని వెంటనే కుటుంబసభ్యులు దగ్గర్లోని సిద్దిపేట హాస్పిటల్ కు తరలించినా ఫలితం లేకుండా పోయింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ పరిస్థితి పూర్తిగా విషమించడంతో రామస్వామి మృతిచెందాడు. 

(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)
 

click me!