ఆస్తులు ఇవ్వలేదని తల్లి డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కామారెడ్డి: ఆస్తులు ఇవ్వలేదనే కారణంగా తల్లి డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు.కామారెడ్డి జిల్లాలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది.
కామారెడ్డి జిల్లాకు చెందిన కిష్టవ్వకు 70 ఏళ్లు. ఆమెకు కూతుళ్లున్నారు. అయితే ఆమెకు బ్యాంకులో రూ. 1.70 లక్షల నగదు ఉంది. మరో వైపు ఆస్తులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఆస్తులకు కిష్టవ్వ బంధువు నామినీగా ఉన్నాడు.
అయితే ఏప్రిల్ 21న కిష్టవ్వ అనారోగ్యంతో చికిత్స కోసం కామారెడ్డి ఆసుపత్రిలో చేరింది. ఈ విషయం తెలుసుకున్న కూతుళ్లు ఆసుపత్రికి వచ్చారు. ఆస్తులు ఇవ్వాలని కిష్టవ్వపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఆస్తులు ఇచ్చేందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆసుపత్రిలోనే కిష్టవ్వపై కుటుంబ సభ్యులు దాడి చేశారని ప్రచారం సాగుతుంది. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే ఈ నెల 6వ తేదీ రాత్రి కిష్టవ్వ మృతి చెందింది. అయితే ఈ విషయం కుటుంబ సభ్యులకు వైద్యులు సమాచారం ఇచ్చారు. ఆస్తులు ఇవ్వలేదని కిష్టవ్వ డెడ్ బాడీ తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. దీంతో కిష్టవ్వ డెడ్ బాడీని మార్చురీలోనే భద్రపర్చారు వైద్యులు.