వింత బేరం : కరోనా మృతదేహంపై ఆభరణాలు తీసిస్తే.. రూ. 14 వేలు..

By AN TeluguFirst Published May 19, 2021, 2:59 PM IST
Highlights

కరోనా మహమ్మారి ఎన్నో విచిత్రాలను చూపిస్తోంది. ఎన్నో వింత సంఘటనలకు కారణమవుతోంది. తాజాగా కరోనా మృతదేహాల మీదున్న నగలు తీసిస్తే రూ. 14 వేల నగదు ఇచ్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. 

కరోనా మహమ్మారి ఎన్నో విచిత్రాలను చూపిస్తోంది. ఎన్నో వింత సంఘటనలకు కారణమవుతోంది. తాజాగా కరోనా మృతదేహాల మీదున్న నగలు తీసిస్తే రూ. 14 వేల నగదు ఇచ్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. 

రంగారెడ్డి జిల్లా కీసరలో ఈ ఘటన వెలుగు చూసింది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను ముట్టుకునేందుకు బంధువులు, కుటుంబసభ్యులు కూడా ధైర్యం చేయడం లేదు. కనీసం చివరిచూపుకు పోవాలంటే కూడా భయంతో వణికిపోతున్నారు. 

ఇలాంటి పరిస్థితుల్లో కరోనాతో చనిపోయిన వారి ఒంటిమీద నగలుంటే వాటిని తీయడానికి ఎవ్వరూ సాహసించడం లేదు. దీంతో కొన్నిసార్లు స్మశానాల్లో శవాల మీద నగలు ఒలుచుకుపోయిన ఘటనలు కూడా బయటపడ్డాయి. 

అయితే కరోనాతో చనిపోయిన ఓ వృద్ధురాలి ఒంటిమీదున్న నగలు తీయడానికి ఓ వ్యక్తి ముందుకు వచ్చాడు. వివరాల్లోకి వెడితే.. మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లా కీసర దాయరకు చెందిన ఓ వృద్ధురాలు కరోనాతో మృతి చెందింది. 

ఆమె మృతదేహాన్ని స్మశాన వాటికకు తీసుకొచ్చారు. అయితే, ఆమె ఒంటిమీద రూ.లక్షపైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. వాటిని తీసేందుకు కుటుంబసభ్యులు ఎవ్వరూ ముందుకు రాలేదు.

వాటిని అలాగే వదిలేయడానికీ ఇష్టపడలేదు. దీంతో ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ. 14 వేలకు బేరం కుదిరింది. ఆ వ్యక్తి మృతురాలి ఒంటిమీద ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసి కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతోంది. 

click me!