రాజయ్యపై బావమరిది భార్య పోటీ: ఎవరీ ఇందిర

By ramya neerukondaFirst Published Nov 13, 2018, 1:30 PM IST
Highlights

రాజయ్య టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో దిగుతుంటే.. ఆయన బావ మరిది భార్య సింగాపురం ఇందిర కాంగ్రెస్ నుంచి ఎన్నికలకు సై అంటున్నారు.

వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో రాజయ్య కు పోటీగా ఆయన బావమరిది భార్య రంగంలోకి దిగుతోంది. రాజయ్య టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో దిగుతుంటే.. ఆయన బావ మరిది భార్య సింగాపురం ఇందిర కాంగ్రెస్ నుంచి ఎన్నికలకు సై అంటున్నారు.

ఇక్కడి టికెట్‌ కోసం ఇందిరతోపాటు డాక్టర్‌ విజయరామారావు, రేవంత్‌తోపాటు పార్టీలో చేరిన దొమ్మాటి సాంబయ్య పోటీ పడ్డారు. ఆర్థికంగా స్థితిమంతురాలు, వ్యాపారవేత్త ఇందిరకు ఇస్తే రాజయ్యకు ఇబ్బందికర పరిణామమేనని కాంగ్రెస్‌ నాయకులు అధిష్ఠానానికి సూచించారు. అంతేకాకుండా ఇందిర కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహకు బాగా దగ్గరి వ్యక్తి. దీంతో ఇక్కడ ఆమెకే టికెట్‌ ఖరారైంది.

ఇందిర భర్త అమృతయ్య. ఈ అమృతయ్య చెల్లెలినే రాజయ్య వివాహం చేసుకున్నారు. ఇందిర స్వస్థలం చేర్యాల. ఆమె తండ్రి గతంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ లో కీలకంగా పనిచేశారు. ఆమె సోదరి సరోజమ్మ బిజెపిలో యాక్టివ్ క్యాండిడేట్. సిద్ధిపేటలో గతంలో కేసిఆర్ మీద పోటీ చేసి ఓడిపోయింది. 

ఇందిర రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. ఆమెకు కల్వరి అనే సొంట టీవీ ఛానెల్ కూడా ఉంది. షాద్ నగర్ లో కోళ్ల ఫారాలు కూడా ఉన్నాయి. క్రిష్టియన్ సంస్థలతో మంచి సంబంధాలు ఉన్నాయి.

రాజయ్యకు ఇందిర గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. కడియం శ్రీహరి వర్గం మనస్ఫూర్తిగా సహకారం అందిస్తే రాజయ్య బయటపడే అవకాశాలున్నాయి. రాజయ్యకు సహకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేసిఆర్ కడియం శ్రీహరిని ఇది వరకే హెచ్చరించారు. దీంతో కడియం రాజయ్యకు సహకరించకుండా ఉండలేని పరిస్థితిలో పడ్డారని సమాచారం. కడియం శ్రీహరి వర్గం సహకరించకపోతే మాత్రం ఇందిర విజయం సాధించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో.. ఇప్పుడు అందరి ఆసక్తి ఈ నియోజకవర్గంపై నే పడింది. మరి ఈ ఫ్యామిలీ ఫైట్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు ఆగాల్సిందే.  

click me!