అలిగి ఇంట్లో నుంచి పరారీ... 8ఏళ్ల తర్వాత

By ramya NFirst Published Apr 4, 2019, 1:34 PM IST
Highlights

అలిగి ఇంట్లో నుంచి పరారైన యువకుడు తిరిగి 8ఏళ్ల తర్వాత మళ్లీ తన కుటుంబానికి చేరువయ్యాడు. ఫేస్ బుక్ సహాయంతో అతని ఆచూకీని అతని సోదరుడు కనుక్కోవడం గమనార్హం.

అలిగి ఇంట్లో నుంచి పరారైన యువకుడు తిరిగి 8ఏళ్ల తర్వాత మళ్లీ తన కుటుంబానికి చేరువయ్యాడు. ఫేస్ బుక్ సహాయంతో అతని ఆచూకీని అతని సోదరుడు కనుక్కోవడం గమనార్హం. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మౌలాలిలోని నవోదయనగర్‌లో నివాసముండే సుసన్నా, అబ్బాస్‌ దంపతులకు దీపక్‌(22), దినేశ్‌(21) కుమారులు. 8ఏళ్ల క్రితం దీపక్‌ 9వ తరగతి, దినేశ్‌ 8వ తరగతి చదివుతున్న సమయంలో 2011 జనవరి 20న అన్నదమ్ములు క్రికెట్‌ ఆడుకొంటూ గొడవపడ్డారు. అలిగిన దినేశ్‌ ఇంట్లో చెప్పకుండా పారిపోయాడు. కొడుకు తిరిగిరాకపోవడంతో తల్లి.. కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
కేసు నమోదు చేసిన పోలీసులు ఆచూకీ కోసం వెతికినా ఫలితం దక్కలేదు. ఇంట్లో నుంచి పారిపోయిన దినేశ్‌ అదే రోజు సికింద్రాబాద్‌లో రైలెక్కి ఢిల్లీ చేరుకొన్నాడు. అక్కడ నుంచి పంజాబ్‌లోని అమృతసర్‌ దగ్గర్లో రాణాకలా అనే గ్రామానికి చేరుకొన్నాడు. అక్కడ సుక్రాజ్‌సింగ్‌ అనే లాండ్‌లార్డ్‌ దీనేశ్‌ను చేరదీశాడు. 
అప్పటి నుంచి అక్కడే ఉంటూ వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. 2015లో ఒకసారి తల్లిని, అన్నను చూడాలనిపించి దినేశ్‌ సికింద్రాబాద్‌కు వచ్చాడు. ఇంటికి వెళ్లేందుకు ధైర్యం చాలక తిరిగి పంజాబ్‌లో తాను పనిచేస్తున్న చోటుకు వెళ్లాడు. 2018 ఆగస్టులో అతడు దినేశ్‌ జీనా లీమా పేరుతో ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేశాడు.
 
అటు.. అన్న దీపక్‌ బీటెక్‌ పూర్తి చేసుకున్నాడు. తమ్ముడి ఆచూకీ కోసం వెతికే ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. ఫేస్‌బుక్‌లో తన తమ్ముడి పేరుతో ప్రొఫైల్‌ వెతికాడు. అందులో తమ్ముడి ఫొటో రావడంతో వెంటనే పోలీసులకు గత నెలలో సమాచారం ఇచ్చారు. సైబర్‌ క్రైం పోలీసుల సహకారం ఆధారంగా దినేశ్‌ ఆచూకీ లభ్యమైంది. సైబర్‌ క్రైమ్‌ సీఐ తన బృందంతో పంజాబ్‌లోని రాణాకలా చేరుకొని దినేశ్‌ ను తీసుకొచ్చారు. 8ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు తిరిగిరావడంతో ఆ తల్లి ఆనందానికి అంతులేదు.

click me!