
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆయనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మీడియతో మాట్లాడుతూ.. తనను సస్పెండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి తాను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు సభ్యత్వమే లేదని కొందరు మాట్లాడారని.. అలాంటప్పుడు సస్పెండ్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పారదర్శకత పాలన అందించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు.
తాను వైసీపీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్‌లోకి రావాలని ఎన్నోసార్లు ఆహ్వానించారని చెప్పారు. పాలేరు ఉప ఎన్నిక వేళ పార్టీలో చేరాలని కేసీఆర్ ఒత్తిడి తెచ్చారని తెలిపారు. మంత్రి కేటీఆర్ తనతో అనేక సార్లు మాట్లాడారని చెప్పారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ మాటలు నమ్మే తాను పార్టీలో చేరానని చెప్పారు. పార్టీ లో చేరిన కొత్తలో ఢిల్లీలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు.. కేసీఆర్ 6 నెలలు బాగానే చూసుకుంటారని, ఆ తర్వాత పట్టించుకోరని చెప్పారని అన్నారు. అయితే బీఆర్ఎస్‌లో చేరిన 5 నెలలకే తనకు పరిస్థితి అర్థమైందని తెలిపారు. తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో చాలాసార్లు ఇబ్బందులు పెట్టినా, అవమాన పరిచిన దిగమింగుకుని ఉన్నానని చెప్పారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరి చొప్పునే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని అన్నారు. 2018 ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులతో ఏనాడైనా సమీక్ష చేశారా అని ప్రశ్నించారు. 9 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమిపై చర్చించారా? అని కేసీఆర్‌ను అడిగారు. ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు.. ఇదే మాట ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు.
తనకు టికెట్ ఇవ్వకపోయినా.. నామా నాగేశ్వర్ రావును ఎంపీగా గెలిపించేందుకు చాలా కృషి చేశానని చెప్పారు. ఒకవేళ నామా నాగేశ్వరరావును తాను గెలిపించలేదా అని ప్రశ్నించారు. ఒకవేళ తాను గెలిపించలేరని మీరు భావించినప్పుడు ఎలక్షన్స్ కు ముందు నాకు ఎందుకు బాధ్యతలు ఇచ్చి ప్రాథేయపడాలని ప్రశ్నించారు. ఎన్నికలు అయ్యాక రాజ్యసభ సీటు ఇస్తానన్న చెప్పిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. తనకు ఉన్న ప్రజాదరణ చూసి రాజ్యసభ సీటు ఇస్తే ప్రమాదమని గ్రహించి.. మోసం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్ కోసమే తాను బీఆర్ఎస్‌లో కొనసాగానని చెప్పారు.