
బీఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన దగ్గరి నుంచి తనకు అనేక అవమానాలు జరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటలు మాత్రమే చెబుతారని.. ఈసారి కూడా మాటలు చెప్పి సీఎం కావాలని అనుకుంటున్నారని పొంగులేటి దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పుడున్న నేతలలో ఏ ఒక్కరిని అసెంబ్లీ గేటు తాకనివ్వనని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కష్టాల్లో వున్నప్పుడు, పార్టీ పట్టించుకోనప్పుడు తాను మీకు అండగా వున్నానని ఆయన తన మద్ధతుదారులతో అన్నారు. గడిచిన నాలుగేళ్లలో అధిష్టానం ఎంత హీనంగా చూసిందో గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. తాను మరోసారి ప్రజాప్రతినిధిగా గెలుస్తానని పొంగులేటీ ధీమా వ్యక్తం చేశారు.
కాగా.. బీఆర్ఎస్ నాయకత్వంపై తిరుగుబాటు చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు,. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై ఆ పార్టీ నాయకత్వం సస్పెన్షన్ వేటేసింది. ఈ ఇద్దరు నేతలను బీజేపీలో చేర్చుకోవాలని ఆ పార్టీ నాయకత్వం ఆసక్తిని చూపుతుంది. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు డికే అరుణ, ఏపీ జితేందర్ రెడ్డిలు ఫోన్ చేశారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ నేతలు సంప్రదింపులుు జరుపుతున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు. అటు ఈ ఇద్దరు నేతలతో కాంగ్రెస్ నేతలు కూడా టచ్ లో ఉన్నారు.
ALso Read: ఢిల్లీలోనే బండి , ఈటల మకాం: జూపల్లి సహా ముగ్గురు నేతల చేరికపై హైకమాండ్‌తో చర్చలు
తెలంగాణ రాష్ట్రంలోని ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను తమ పార్టీలో చేర్చుకొనే విషయమై బీజేపీ అగ్రనేతలతో రాష్ట్ర నేతలు చర్చిస్తున్నారని ప్రచారం సాగుతుంది. తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఈ దిశగా బీజేపీ నాయకత్వం పావులు కదుపుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గత వారంలో బీజేపీలో చేరారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిక రాజకీయంగా ఆ పార్టీకి ప్రయోజనం కల్గించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.