కాంగ్రెస్‌కు ఒక పాలసీ లేదు.. నేను బీజేపీని వీడటం లేదు..: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Published : May 20, 2023, 05:42 PM ISTUpdated : May 20, 2023, 05:47 PM IST
కాంగ్రెస్‌కు ఒక పాలసీ లేదు.. నేను బీజేపీని వీడటం లేదు..: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

సారాంశం

తెలంగాణ ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉందని ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్‌ను ఓడించే సత్తా ఉన్న ఏకైక పార్టీ బీజేపీనే అని అన్నారు. 

తెలంగాణ ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉందని ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్‌ను ఓడించే సత్తా ఉన్న ఏకైక పార్టీ బీజేపీనే అని అన్నారు. తెలంగాణ బీజేపీ విచిత్రమైన పరిస్థితిలో ఉందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి శుక్రవారం కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారంపై స్పందించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. తాను పార్టీ మారడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. 

ఈరోజు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను బీజేపీని వీడి ఎక్కడికి వెళ్లడం లేదన్నారు. బీజేపీలో నుంచి తానే కాదు.. ఎవరూ పార్టీ మారడం లేదని చెప్పారు. రేవంత్ రెడ్డి లక్ష్యం, తమ లక్ష్యం ఒకటేనని అన్నారు. అయితే కేసీఆర్‌ను ఢీకొట్టే ఆయుధాలు తమ వద్దే ఉన్నాయని చెప్పారు. 

Also Read: తెలంగాణలో బీజేపీకి సంకటం.. కవిత అరెస్ట్ కాకపోవడం వల్లే, ఈటల కొత్త పార్టీ అవాస్తవం : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ గతంలో బలవంతంగా ఏపీ, తెలంగాణలను కలిపిందని అన్నారు. చిన్న రాష్ట్రాలు ఉంటే.. దేశం బాగుపడుతుందనేది బీజేపీ సిద్దాంతమని చెప్పారు. రెండు రాష్ట్రాలను బలవంతంగా కలిపిన కాంగ్రెస్ పార్టీ.. రాజకీయ అవసరాల కోసం మళ్లీ విడదీసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాల కోసం ఏదైనా చేస్తుందని.. వారికి ఒక పాలసీ, సిద్దాంతం అంటూ ఏది లేదని మండిపడ్డారు. బీజేపీపై మతతత్వ పార్టీ ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. తమ గుజరాతీ పార్టీ అని అంటున్నారని.. అసలు ఆర్‌ఎస్‌ఎస్ పుట్టిందే తెలంగాణ నుంచి అని చెప్పారు.  

ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఉన్నావాళ్లందరూ తెలంగాణకు వ్యతిరేకంగా  ఉన్నవాళ్లేనని విమర్శించారు. ఉద్యమ సమయంలో అంతా ఆంధ్రోళ్లు దొంగలని.. తెలంగాణ రాష్ట్రం కావాలని అన్నారని చెప్పారు. బీజేపీ ఎప్పుడూ ఆంధ్రోళ్లు దొంగలని అనలేదని తెలిపారు. చిన్న రాష్ట్రం అయితే దేశం, రాష్ట్రం అభివృద్ది చెందుతుందని బీజేపీ నమ్ముతుందని  చెప్పారు. ఒక సిద్దాంతానికి కట్టుబడి ఉన్న పార్టీ బీజేపీ మాత్రమేనని తెలిపారు. బీజేపీకి కర్ణాటకలో గతంలో ఎన్ని ఓట్లు వచ్చాయో.. ఇప్పుడు కూడా అన్నే ఓట్లు వచ్చాయని చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?