టీ బీజేపీలో నలుగురు కోవర్టులు ఎవరు?.. పార్టీ అధిష్టానానికి సమాచారం ఉందా?.. క్యాడర్‌లో గందరగోళం..

By Sumanth KanukulaFirst Published Jun 8, 2023, 11:29 AM IST
Highlights

తెలంగాణలో ‘‘కోవర్టు రాజకీయాల’’ ప్రస్తావన తరుచూ చర్చనీయాంశంగా మారింది. తమ పార్టీలో వేరే పార్టీల కోవర్టులు ఉన్నారనే పలువురు నేతలు ఆరోపణలు చేస్తుండటం రాజకీయంగా కలకలం రేపుతూనే ఉంది.

తెలంగాణలో ‘‘కోవర్టు రాజకీయాల’’ ప్రస్తావన తరుచూ చర్చనీయాంశంగా మారింది. తమ పార్టీలో వేరే పార్టీల కోవర్టులు ఉన్నారనే పలువురు నేతలు ఆరోపణలు చేస్తుండటం రాజకీయంగా కలకలం రేపుతూనే ఉంది. తెలంగాణ  బీజేపీలో కోవర్టులు ఉన్నారనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ గతంలో ఓ సందర్భంలో అన్ని పార్టీల్లో సీఎం కేసీఆర్ కోవర్టులున్నారని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలోనూ కేసీఆర్ కోవర్టులున్నారని ఈటల అన్నారు. అయితే ఈటల వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్.. బీజేపీలో కేసీఆర్ కోవర్టులు లేరని చెప్పారు. 

తాజాగా బీజేపీ నేత, పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. బీజేపీలో కేసీఆర్ కోవర్టులున్నారని ఆరోపించిన ఆయన.. ఈ విషయంపై పార్టీ అగ్రనాయకత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా పేర్కొన్నారు. కోవర్టుల పేర్లను కూడా పార్టీ నాయకత్వానికి వెల్లడించానని.. ఆ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు కూడా చెప్పుకొచ్చారు. ‘‘ఇది నిజం కాకపోతే, నేను దాని గురించి మాట్లాడను. ఇది పార్టీకి నష్టాన్ని కలిగిస్తుంది’’ అని అన్నారు. 


పార్టీ సమావేశాలకు సంబంధించిన సమాచారాన్ని పార్టీలో కొందరు నేతలు లీక్ చేస్తున్నారనే బలమైన సమాచారం ఉందని కూడా అన్నారు. ఈ సమాచారాన్ని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్‌, పార్టీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్‌కు కూడా చెప్పినట్టుగా తెలిపారు. ‘‘బీజేపీలో కేసీఆర్‌ కోవర్టులు ఉన్నారని చెప్పడంలో నేను మొదటివాడిని కాదు’’ అని అన్నారు. ఇదే మాట పార్టీలోని ఇతరులు కూడా చెప్పారని తెలిపారు. కోవర్టులెవరో త్వరలో వెల్లడిస్తానన్నారు. 

ఇక, నందీశ్వర్ గౌడ్ 15 రోజుల్లో కీలక నిర్ణయం ప్రకటిస్తానన్నారు. కోవర్టులు వారి తీరును మార్చుకోకపోతే వారి పేర్లను మీడియాకు ఇస్తానన్నారు.  మరోవైపు నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ లో చేరనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా.. టీ బీజేపీలో ఇంటి దొంగలు ఉన్నారా? అనే చర్చ ఆ పార్టీ క్యాడర్‌లో జరుగుతుంది. దీంతో ఆ నలుగురు ఎవరై ఉంటారనే? చర్చ సాగుతుంది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యంత్రి కేసీఆర్ కావాలనే బీజేపీ అంతర్గత వ్యవహారాలు కనుక్కోవడానికి మనుషులను పార్టీలోకి పంపారా..? అనే చర్చ కూడా నడుస్తోంది. 

ఆ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోందో తెలియక కార్యకర్తలు, నేతలు ఆందోళన చెందుతున్నారు. కొందరమో.. తెలంగాణ బీజేపీలో కోవర్టులు ఉండేందుకు అవకాశం లేదని.. పార్టీ నాయకులపై హైకమాండ్ పూర్తి పర్యవేక్షణతో ఉంటుందని చెబుతున్నారు. మరికొందరు మాత్రం తమ పార్టీలో తీసుకుంటున్న నిర్ణయాలు అధికార బీఆర్ఎస్‌కు చేరుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. 

ఇప్పుడు నందీశ్వర్ గౌడ్ కూడా కోవర్టులు ఉన్నారని  ఆరోపించడం.. పార్టీ  అధిష్టానం ఆయన వ్యాఖ్యలపై స్పందిచకపోవడం గందరగోళంగా మారింది. అయితే నందీశ్వర్ గౌడ్ పార్టీ మారడానికి నిర్ణయించుకున్నారని.. అందుకే ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారనే విమర్శించేవారు కూడా  ఉన్నారు. మరి నందీశ్వర్ పరిణామాలపై బీజేపీ అధిష్టానం స్పందిస్తుందా?.. అసలు అందులో నిజమెంత?.. ఈలోపే ఆయన పార్టీ మారుతారా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరుకుతుందని అంతా భావిస్తున్నారు. 

click me!