
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు వేగంగా కదుపుతోంది. పేపర్ లీకేజ్, బండి సంజయ్ అరెస్ట్ తదితర అంశాలతో బీజేపీకి మంచి బూస్ట్ వచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణలో బలమైన నేతలను ఆ పార్టీ టార్గెట్ చేసింది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో వున్న అసంతృప్త నేతలపై గురిపెట్టింది. తాజాగా మాజీ మంత్రి , ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఆయన బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పట్నం మహేందర్ రెడ్డి స్పందించారు. తాను బీజేపీలో చేరుతున్నట్లుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తనకు బీజేపీలో చేరే ఆలోచనే లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంపై మాకు పూర్తి విశ్వాసం వుందని.. బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన హితవు పలికారు.
ఇదిలావుండగా.. మహేందర్ రెడ్డి.. ఉమ్మడి ఏపీ మాజీ హోంమంత్రి పీ. ఇంద్రారెడ్డికి మేనల్లుడు. తాండూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పలుమార్లు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన ఆయన.. తాండూరు నుంచి మరోసారి ఎన్నికై కేసీఆర్ కేబినెట్‌లో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే 2018లో కాంగ్రెస్ అభ్యర్ధి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2019లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన సతీమణి సునీతా రెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా, సోదరుడు నరేందర్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా వున్నారు. అయితే నియోజకవర్గంలో పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. ఈ విషయం పలుమార్లు అధిష్టానం దృష్టికి కూడా వచ్చింది.