బీజేపీతో పొత్తుపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ‘మల్కాజ్‌గిరి టికెట్ భద్రమే’

By Mahesh K  |  First Published Feb 16, 2024, 7:47 PM IST

బీఆర్ఎస్, బీజేపీల మధ్య పొత్తు లేదని, ఒక వేళ ఉంటే బండి సంజయ్ ఎందుకు మా పార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని అంటారని మల్లారెడ్డి అన్నారు. ఒక వేళ పొత్తు ఉన్నా.. మల్కాజ్‌గిరి టికెట్ తన కొడుకుకు భద్రంగా ఉంటుందని స్పష్టం చేశారు.
 


MallaReddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి పొత్తు ఉన్నదనే వాదనలు, ఆరోపణలు ఆ రెండు పార్టీలకు నష్టాన్నే తెచ్చింది. లోక్ సభ ఎన్నికల ముంగిట్లో మరోసారి ఈ రెండు పార్టీల మధ్య పొత్తు గురించి వాదనలు వస్తున్నాయి. అయితే.. ఈ వాదనలను ఉభయ పార్టీలు కొట్టేస్తున్నాయి.

మాజీ మంత్రి చామకుర మల్లారెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. ఈ సున్నితమైన పొత్తు విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే తమ పార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బండి సంజయ్ ఎందుకు అంటారని ప్రశ్నించారు. అదే సందర్భంలో ఒక వేళ బీజేపీతో పొత్తు ఉన్నా.. మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ మాత్రం తన కొడుక్కు భద్రంగా ఉన్నదని అన్నారు. ఒక వేళ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా మల్కాజ్‌‌గిరి గులాబీ పార్టీకే ఉంటుందని స్పష్టం చేశారు.

Latest Videos

Also Read: Sonia Gandhi: సోనియా గాంధీ ఆస్తుల లెక్కలు ఇవే.. ఇటలీ ఇంటి షేర్ ఎన్ని లక్షలంటే?

‘ఒక వేళ పొత్తు ఉంటే మా పార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బండి సంజయ్ ఏ విధంగా అంటారు? ఆయనతో అయ్యేది లేదు, పోయేది లేదు. ఒక వేళ బీజేపీతో పొత్తు ఉన్నా.. మల్కాజ్‌గిరి సీటు బీఆర్ఎస్‌కే ఉంటుంది. ఆ స్థానం నుంచి బీఆర్ఎస్ టికెట్ భద్రంగా ఉన్నది. నా కొడుకు భద్రారెడ్డికే ఆ టికెట్ వస్తుంది. నా కొడుకుకు టికెట్ ఇస్తే దాన్ని కుటుంబానికి ఇచ్చారని చెప్పడం సరికాదు. నా అల్లుడు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుటుంబం వేరు, నా కుటుంబం వేరు.’ అని మల్లారెడ్డి స్పష్టం చేశారు.

ఈ రోజు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని బండి సంజయ్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత మల్లారెడ్డి పై విధంగా మాట్లాడారు.

click me!