
వనపర్తి: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌లో ఈరోజు తన అనుచరులతో సమావేశం అయ్యారు. నిన్న బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన జూపల్లి కృష్ణారావు.. అనుచరులతో జరిగిన సమావేశంలో భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. అనంతరం జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తమకు భావప్రకటన స్వేచ్చ ఉందని అన్నారు. తప్పు చేసినప్పుడు స్వపక్షమైనా ప్రశ్నించే బాధ్యత ఉంటుందని చెప్పారు.
పరిపాలనలో అన్యాయం జరిగితే ప్రశ్నించడం తప్పా? అని ప్రశ్నించారు. తమ నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించానని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికీ సర్పంచ్‌లు గోస పడుతున్నారని అన్నారు.తాను అడిగిన ప్రశ్నలకు మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం చెప్పలేదని అన్నారు. 1,600 ఎకరాల భూములు కబ్జాకు గురైన ఇప్పటివరకు చర్యలు లేవని అన్నారు. మూడేళ్ల నుంచి తనకు సభ్యత్వ పుస్తకాలే ఇవ్వలేదని చెప్పారు. పార్టీ బాధ్యతలే ఇవ్వకుండా సస్పెండ్ చేశామని ఎలా అంటారని ప్రశ్నించారు.
తాను తెలంగాణ కోసం పోరాటం చేశానని చెప్పారు. తెలంగాణ వద్దన్న నేత వద్దకు వెళ్లి సభ్యత్వం తీసుకోవాలా? అని ప్రశ్నించారు. తాను ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి పూర్తిగా సహకరించానని చెప్పారు. తన సహకారం వల్లే రెండె ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. తాను ఓడిపోయి పదవులు అడిగే వ్యక్తిని కాదని చెప్పారు. తమ ఇంట్లో వైఎస్సార్ ఫోటో అప్పుడు ఉంది.. ఇప్పుడు ఉంది.. ఎప్పుడూ ఉంటదని అన్నారు. సీఎం కేసీఆర్ ఫోటో కూడా ఉందని చెప్పారు.