
హైదరాబాద్: వీఎస్టీ నుంచి ఇందిరా పార్క్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జీ సెంట్రల్ హైదరాబాద్ నగరానికే తలమానికంగా మారబోతున్నదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు ఆయన ముషీరాబాద్‌లో ఆకస్మిక పర్యటన చేశారు. స్టీల్ బ్రిడ్జీ నిర్మాణ పనులతోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను తనిఖీ చేశారు.
మంత్రి కేటీఆర్ ముందుగా ఇందిరా పార్క్ వద్ద కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జీ పనుల వద్దకు వెళ్లారు. ఈ స్టీల్ బ్రిడ్జీ పురోగతిని జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పలు సూచనలు, ఆదేశాలు చేశారు. మరో మూడు నెలల్లో ఈ బ్రిడ్జీ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేసి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అన్నారు. ఇందుకు అవసరమైన ట్రాఫిక్ మళ్లింపుల విషయాల్లో నగర ట్రాఫిక్ పోలీసు విభాగంతో సమన్వయంలో ఉండాలని సూచనలు చేశారు.
ఈ పనులు పరిశీలించుకుంటూ మంత్రి కేటీఆర్ వీఎస్టీ చేరుకున్నారు. అక్కడ దాదాపు పూర్తయిన ర్యాంపు పై నుంచి బ్రిడ్జీ పనులను పరిశీలించారు. ఎస్ఆర్డీపీ ఫ్లై ఓవర్ల తరహాలోనే ఈ స్టీల్ బ్రిడ్జీ అద్భుత నిర్మాణం ఉంటుందని అన్నారు. 2.62 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల ఈ స్టీల్ బ్రిడ్జీ నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ సుమారు రూ. 426 కోట్లు ఖర్చు చేస్తున్నదని వివరించారు.
ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్‌పేట్ నియోజకవర్గాల ప్రజల రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్డ వద్ద ట్రాఫిక్ తగ్గించేలా ఈ బ్రిడ్జీ నిర్మించాలని రెండు దశాబ్దాలుగా డిమాండ్ ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ బ్రిడ్జీని వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో కాంక్రీట్ కాకుండా స్టీల్ బ్రిడ్జీ నిర్మిస్తున్నట్టు వివరించారు.
అనంతరం, ఆయన ఎస్ఎన్‌డీపీ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పలు మౌలిక సదుపాయాల కార్యక్రమాలను పరిశీలించారు. హుస్సేన్ సాగర్ సర్‌ప్లస్ నాలాలో పనులను సమీక్షించారు. రిటైనింగ్ వాల్ పనులనూ పరిశీలించారు. హుస్సేన్ సాగర్ వరద నీటి ద్వారా లోతట్టు ప్రాంతాలకు ముంపు ఇబ్బందులు రాకుండా ఈ పనులు చేస్తున్నట్టు తెలిపారు. వర్షాకాలానికి ముందే ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.