కాంగ్రెస్ గెలిచినా సీఎం అయ్యేది కేసీఆరే .. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Apr 20, 2023, 9:50 PM IST
Highlights

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా సీఎం అయ్యేది కేసీఆరేనంటూ వ్యాఖ్యానించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనన్న ఈటల.. కాంగ్రెస్ మీద కేసీఆర్ ఈగ కూడా వాలనివ్వడం లేదన్నారు. 

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా సీఎం అయ్యేది కేసీఆరేనంటూ వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాన పర్యటన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు గురువారం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలు, దుర్మార్గాలు, పోలీసులను నమ్ముకున్నారని ఆయన దుయ్యబట్టారు. 

విపక్ష నేతలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ లొంగకపోతే వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఎదిరించి నిలిచేది ఒక్క బీజేపీ మాత్రమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనన్న ఈటల.. కాంగ్రెస్ మీద కేసీఆర్ ఈగ కూడా వాలనివ్వడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా సీఎం అయ్యేది మాత్రం కేసీఆరేనంటూ రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా పాల్గొనే చేవేళ్ల సభను విజయవంతం చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. 

Latest Videos

Also REad: టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ కుట్ర కేసు:తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్ క్వాష్ పిటిషన్

అంతకుముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల కష్టాలు, సంస్థ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని తాకట్టు పెట్టాలని అనుకుంటున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీఆర్ఎస్‌ది ఒక జిమ్మిక్కు మాత్రమేనని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బొగ్గు గనులు వేలం వేస్తుంటే అందులో పాల్గొని సింగరేణికి వాటిని దక్కేలా చేయకుండా.. విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని కిషన్ రెడ్డి చురకలంటంచారు. 

సింగరేణిలో అంతర్గత ప్రైవేటీకరణ, ఔట్ సోర్సింగ్, అద్వన్నమైన ఆర్ధిక వ్యవస్థ, గనుల్లో భద్రత లోపించిందని ఆయన ఆరోపించారు. కోల్ ఇండియాలో పనిచేసే కార్మికులకు 930 రూపాయల వేతనం వుంటే.. సింగరేణిలో పనిచేసే వారికి కేవలం 420 మాత్రమే వేతనంగా ఇస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కార్మిక సంఘాలు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణపై నరేంద్ర మోడీ ఎలాంటి వివక్ష చూపలేదని ఆయన అన్నారు. 

click me!