మాదిగ ఉపకులాల విశ్వరూప సభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ. దళితులను కాంగ్రెస్ మోసం చేసిందని మోడీ అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాదిగ ఉపకులాల విశ్వరూప సభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులను కాంగ్రెస్ మోసం చేసిందని మోడీ అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 ఏళ్లు అధికారంలో వున్నా ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయలేదని రాజనర్సింహ ప్రశ్నించారు. కాళేశ్వరం కుంగిపోతుంటే మోడీ ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చి పదేళ్లయినా ప్రజల జీవన స్థితిగతులు మారలేదన్నారు. ధనిక రాష్ట్రంగా కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిందని ఆయన తెలిపారు. ప్రజలపై రూ.5 లక్షల కోట్ల అప్పుభారం వేశారని భట్టి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ దోపిడీ వల్ల ప్రజల సంపద ప్రజలకు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో మార్పు రావాలి.. ప్రజల సంపద పెరగాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ప్రజలు వేసే ప్రతి ఓటుకు విలువ తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.
కాగా.. నిన్న జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ.. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అంబేద్కర్ ఫోటో కూడా కాంగ్రెస్ పెట్టనివ్వలేదని దుయ్యబట్టారు. అంబేద్కర్‌ను రెండుసార్లు గెలవకుండా చేసింది కాంగ్రెస్సేనని.. ఆయనకు భారతరత్న కూడా ఇవ్వలేదని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా మందకృష్ణ ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నారని మోడీ చెప్పారు. కాశీ విశ్వనాథుడి ఆశీర్వాదంతోనే తాను ప్రధానిగా మీ ముందు వున్నానని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా నిలిచిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.
ALso Read: త్వరలోనే ఎస్సీ వర్గీకరణపై కమిటీ : మాదిగల సభలో, మందకృష్ణ సమక్షంలో మోడీ సంచలన ప్రకటన
బీఆర్ఎస్ నేతల బంధువుల స్కీమ్‌గానే దళితబంధు మారిందని.. పదేళ్లుగా ఇక్కడి ప్రభుత్వం మాదిగల్ని మోసం చేసిందని మోడీ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ చరిత్ర కూడా బీసీలు, అణగారిణ వర్గాలకు వ్యతిరేకమని.. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి, ఆ హామీ నెరవేర్చలేదన్నారు. బీజేపీ ప్రభుత్వ తొలి లక్ష్యం పేదరిక నిర్మూలన ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఆదివాసీ మహిళ అయిన ద్రౌపది ముర్మును ఓడించేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆయన ఎద్దేవా చేశారు.
బలిదానాలు చేసిన వారిని కాదని.. కేసీఆర్ మొదట తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ధన్యవాదాలు చెప్పారని ప్రధాని మోడీ చురకలంటించారు. ఇండియా కూటమి నేత నితీశ్ కుమార్.. పాశ్వాన్, మాంఝీలను అవమానించారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రపతిగా దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ ఎంతో ప్రయత్నించిందని ప్రధాని ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్రం జాషువా తన కష్టాలను కాశీ విశ్వనాథుడికి విన్నవించుకున్నారని.. పండుగ సమయంలో మనకు కావాల్సిన వాళ్ల మధ్య వుంటే.. ఆనందం రెట్టింపు అవుతుందని ప్రధాని చెప్పారు.