తెలంగాణలో కర్ణాటక రాజకీయం.. అధికార, ప్రతిపక్ష నేతల మాటల తూటాలు.. బీఆర్ఎస్‌కు కలిసొచ్చేనా?

By Mahesh K  |  First Published Nov 12, 2023, 4:33 PM IST

తెలంగాణలో కర్ణాటక రాజకీయం జరుగుతున్నది. కర్ణాటకలోని అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు తెలంగాణను తాకుతున్నాయి. కర్ణాటక ఊపును తెలంగాణకు పాకించాలనే ఉద్దేశంతో అక్కడి నేతలు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. వారి మాటలను బీఆర్ఎస్ తిప్పికొడుతున్నది. కాగా, కర్ణాటకలోని ప్రతిపక్ష పార్టీ జేడీఎస్ కాంగ్రెస్ హామీలపై విరుచుకుపడింది. ఇది బీఆర్ఎస్‌కు కలిసివచ్చేలా ఉన్నది.
 


హైదరాబాద్: తెలంగాణలో కర్ణాటక రాజకీయం మొదలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఉధృత ప్రచారం ప్రారంభించగా.. కాంగ్రెస్ పార్టీ కూడా ధీటుగా వ్యూహాలు రచించి ముందుకు వెళ్లుతున్నది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజయంతో తెలంగాణ కాంగ్రెస్‌లోనూ ఊపు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సాహం అంతటితో ఆగలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్‌లో కర్ణాటకలో ఎన్నికై సీఎం, డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు చేపట్టిన వారిని ఇక్కడికి రప్పించి మరీ ప్రచారం చేయిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ లోక్‌ల్‌గా వారికంత ప్రాధాన్యత లేదు. కానీ, జాతీయ పార్టీలు సాధారణంగా అవలంభించే వ్యూహంలో భాగంగా పొరుగు రాష్ట్ర సీఎంను ఇక్కడ ప్రచారానికి ఉపయోగించుకుంది.

ఇక్కడే ఓ ట్విస్ట్ వచ్చింది. కర్ణాటక నుంచి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు ఇక్కడ ప్రచారానికి వచ్చారు. అయితే, కర్ణాటకలో ప్రతిపక్షంలో ఉన్న జేడీఎస్ పార్టీ అగ్రనేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి కూడా తెలంగాణ ఎన్నికలపై మాట్లాడారు. ఆయన తెలంగాణకు రాలేదు గానీ, బెంగళూరులోని పార్టీ కార్యాలయం వేదికగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. కర్ణాటకలోనే హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్నదని హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. తమ రాష్ట్రంలోనే చేయలేని వారు తెలంగాణలో చేస్తామని విడ్డూరంగా ఉన్నదని ఆరోపణలు చేశారు. కర్ణాటకలో ఆ పార్టీ ఇచ్చిన ఐదు గ్యారంటీలు విఫలం అయ్యాయని వివరించారు. రూ. లక్ష వరకు రుణాలు రద్దు చేస్తామని చేయలేదని విమర్శించారు. ఉచిత విద్యుత్ పేరుతో పేదలను మోసం చేసిందని, సాగుకు 5 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

Latest Videos

Also Read: సైన్యంతో ప్రధాని దీపావళి వేడుక.. హిమాలయాలే వలే దృఢంగా నిలబడ్డ ఆర్మీతో దేశం సురక్షితం: మోడీ

దీంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడుతున్నది. వాస్తవానికి ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్‌కు కలిసివచ్చేలా ఉన్నాయి. 24 గంటలు కరెంట్ ఇస్తున్న దేశంలో ఏకైక పార్టీ తమదేనని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇదే తరుణంలో రేవంత్ రెడ్డి ఉదహరిస్తూ చెప్పిన మాటలు బీఆర్ఎస్‌కు అస్త్రంగా కలిసి వచ్చాయి. కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెంట్ మాత్రమే ఉంటుందని బీఆర్ఎస్ ఆరోపణలు సంధిస్తున్నది.

కర్ణాటకలో తాము ప్రకటించిన హామీలు అమలు చేస్తున్నామని, అవసరమైన తమ రాష్ట్రానికి వచ్చి చూడాలని కర్ణాటక అధికారపార్టీ నేతలు బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఆఫర్ చేశారు. కానీ, బీఆర్ఎస్ నేతలు అక్కడి వరకు వచ్చి కాంగ్రెస్ వైఫల్యాలను చూడాల్సిన పని లేదని చెప్పారు. ఈ తరుణంలో కర్ణాటక నుంచే హెచ్ డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

click me!