గజ్వేల్‌లో టఫ్ ఫైట్!.. ఈటల బలం ఏమిటీ?.. బీజేపీ వ్యూహం ఇదేనా?.. ఇంట్రెస్టింగ్ పాయింట్స్

By Mahesh K  |  First Published Oct 22, 2023, 2:57 PM IST

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గ ఎన్నికపై స్పెషల్ ఫోకస్ ఉండనుంది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంపై ఈటల రాజేందర్ ఫైట్ చేయబోతున్నారు. అప్పటి టీఆర్ఎస్ పార్టీ వీడినప్పటి నుంచి వీరిద్దరి మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ముఖాముఖి పోరు గజ్వేల్ వేదికగా జరగనుంది.
 


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తాజాగా 52 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. ఈ జాబితా ఆసక్తికరమైన చర్చను లేవదీసింది. ఇందులో సామాజిక వర్గాల సంతులనం, మహిళలకు ప్రాధాన్యత, నేతల ఎంపిక కీలకంగా ఉన్నాయి. మొదటి నుంచీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని బీజేపీ చెబుతూ వస్తున్నది. తొలి జాబితాలో ఇది స్పష్టంగా కనిపించింది. 52 మందిలో 20 మంది బీసీలు(అత్యధికులు) ఉన్నారు. తర్వాతి ప్రాధాన్యత ఓసీలకు ఉన్నది. మహిళా రిజర్వేషన్‌ను చట్టం చేసిన నేపథ్యంలో వారికీ సముచిత స్థానాన్ని బీజేపీ ఈ జాబితాలో కల్పించింది. ఈ జాబితాలో 12 మంది మహిళా నేతలకు అవకాశం ఇచ్చారు.

ఈటల రాజేందర్‌ను రెండు స్థానాల నుంచి బరిలోకి దించడం ఈ జాబితాలో కీలకంగా ఉన్నది. ఒకటి తన సొంత నియోజకవర్గం హుజురాబాద్ కాగా, మరొకటి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్. సీఎం కేసీఆర్ కూడా గజ్వేల్‌తోపాటు కామారెడ్డి స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించడంతో ఎలక్షన్‌లో అందరి కళ్లు ఈ నియోజకవర్గం పైనే ఉంటాయనడంలో సందేహం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ ఎన్నిక టఫ్‌గా ఉండనుంది.

Latest Videos

Also Read: 52 మందితో బీజేపీ తొలి జాబితా: రెండు చోట్ల ఈటల పోటీ

డ్యామేజీ కంట్రోల్?

బండి సంజయ్ కుమార్‌ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా తొలగించినప్పటి నుంచి పార్టీ దూకుడు తగ్గిందనే వాదనలు ఉన్నాయి. ఎన్నికల ముందు బీజేపీ బలహీనపడిందనే చర్చ జరిగింది. ఈటల రాజేందర్‌ను సీఎం కేసీఆర్‌తో పోటీకి దింపి కొంత మేరకు ఈ డ్యామేజీని బీజేపీ తగ్గించుకునే అవకాశాన్ని కల్పించుకుంది. బీజేపీ అగ్రనేతలు ప్రధానంగా సీఎంను టార్గెట్ చేసుకుని ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే అనే అభిప్రాయాలను ఓటర్లలోకి తీసుకెళ్లే మార్గం ఉన్నది.

సింబాలిజం.. 

బీఆర్ఎస్‌కు బలమైన పోటీదారు బీజేపీ అనే అనుకున్నారు. కానీ, గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. దీంతో బీజేపీ పోటీలో నిలబడి, బీఆర్ఎస్‌ను ఢీకొట్టేది తామేనని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి సింబాలిక్‌గానే బీఆర్ఎస్ అధినేతపై ఈటల రాజేందర్‌ను బరిలోకి దింపే వ్యూహం తీసుకున్నటూ తెలుస్తున్నది.

ఈటల బలం..

రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గం బలమైనది. ఎన్నికల ఫలితల్లో నిర్ణయాత్మకపాత్ర ఈ వర్గం పోషిస్తుంది. బీఆర్ఎస్ మూకుమ్మడిగా దిగి ప్రచారం చేసినా హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ విజయం సాధించడం వెనుక ఈ వర్గమే కారణం అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఈ కమ్యూనిటీని ఆకట్టుకునేలా బీజేపీ వ్యూహాలు రచిస్తున్నది. ఈ నేపథ్యంలోనే బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయింపులు, సీఎం అభ్యర్థి కూడా బీసీ నేతనే ఎంచుకుంటామనే ప్రచారం జరిగింది. ఈటల రాజేందర్ బీసీ కమ్యూనిటీకి చెందిన బలమైన నేత. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన నేత కూడా. గజ్వేల్‌లోనూ ఈటల రాజేందర్ ఈ సామాజిక వర్గంపై ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. అదీగాక, గజ్వేల్‌లోని కొన్ని గ్రామాల్లో ముదిరాజ్ సహా పలు బీసీ సెక్షన్లు ఈటల రాజేందర్‌కు మద్దతుగా నిలుస్తామని బహిరంగంగా ప్రకటించడం గమనార్హం. 

Also Read: రాజాసింగ్ కు ఊరట: సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ

కేసీఆర్ పై బరిలోకి దిగుతానని ఈటల ఇది వరకే చెప్పారు. ఆత్మగౌరవం అనే వాదనను ప్రధానంగా చేసుకుని గజ్వేల్‌లో పోరుకు దిగే అవకాశాలు ఉన్నాయి.

గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ ఒక్కసారి మినహా ఓడిపోలేదు. బలమైన మద్దతు ఆయనకు ఉన్నది. అయితే, ఇటీవలే క్యాడర్‌లో కొంత ముసలం మొదలైనట్టు తెలిసింది. దీంతో హడావుడిగా సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజవకర్గంలోని నేతలు, క్యాడర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాను కామారెడ్డికి వెళ్లనను, ఇల్లు, ముంగిలి ఉన్న గజ్వేల్‌ను వీడేది లేదని హామీ ఇచ్చారు. ఒక రకంగా గజ్వేల్‌ను తన తొలి ప్రాధాన్యంగా సంకేతాలు ఇచ్చారు. 

బెంగాల్ స్ట్రాటజీ?

పశ్చిమ బెంగాల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీతో బీజేపీ హోరాహోరీగా పోటీ పడింది. టీఎంసీ నుంచే బయటకు వచ్చి బీజేపీలో చేరిన సువేందు అధికారిని సీఎం మమతా బెనర్జీపై పోటీకి నిలిపింది. బీజేపీ అగ్రనేతలంతా మమతా బెనర్జీని టార్గెట్ చేసుకుని సువేందు అధికారికి మద్దతుగా ప్రచారం చేశారు. చివరకు మమతా బెనర్జీని ఓడించారు. మెజార్టీని సాధించలేదనేది వేరే విషయం. కానీ, గణనీయంగా సీట్లను, ఓటు షేరును పెంచుకుంది. బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో కాకుండా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించాలనే టార్గెట్ పెట్టుకున్నట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. కాబట్టి, ఈ స్ట్రాటజీ బెస్ట్ అని బీజేపీ భావించి ఉండొచ్చు.

click me!