నెల రోజులు కష్టపడండి .. మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లండి : బీఆర్ఎస్ శ్రేణులకు హరీశ్‌రావు పిలుపు

By Siva Kodati  |  First Published Oct 22, 2023, 2:37 PM IST

నెల రోజులు పార్టీ శ్రేణులంతా కష్టపడాలని సూచించారు బీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి హరీశ్ రావు . కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసి దక్షిణాదిలోనే హ్యాట్రిక్ సాధించిన తొలి సీఎం రికార్డు సృష్టించాలని మంత్రి ఆకాంక్షించారు. ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టిన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడయ్యాడని హరీశ్ దుయ్యబట్టారు. 


నెల రోజులు పార్టీ శ్రేణులంతా కష్టపడాలని సూచించారు బీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి హరీశ్ రావు. ఆదివారం జలవిహార్‌లో బీఆర్ఎస్ ఇన్‌ఛార్జీలతో, వార్ రామ్ సభ్యుల సమావేశంలో హరీశ్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ మేనిఫెస్టోను డోర్ టూ డోర్ అతికించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ చేస్తున్న గోబెల్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ఎక్కడైతే అవసరం వుంటుందో అక్కడ పడుకోవాలని హరీశ్ రావు పేర్కొన్నారు. మేనిఫెస్టోను బలంగా తీసుకెళ్లాలని.. సీఎం జరిగే ప్రదేశాల్లో మేనిఫెస్టో అంశాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో మీదా మైండ్ గేమ్ ఆడుతుందని.. బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజలకు తెలిసేలా చూడాలన్నారు. 

కేసీఆర్ మళ్లీ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని.. తిరుపతి తరహాలో యాదాద్రి ఆలయాన్ని నిర్మించామని.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు మూడు మెడికల్ కాలేజీలు మంజూరు చేశామని హరీశ్ రావు తెలిపారు. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసి దక్షిణాదిలోనే హ్యాట్రిక్ సాధించిన తొలి సీఎం రికార్డు సృష్టించాలని మంత్రి ఆకాంక్షించారు. కర్ణాటకలో సరిపడా కరెంట్ లేదని, రైతులంతా కలిసి మొసళ్లను తీసుకెళ్లి కార్యాలయాల్లో వదిలేశారని హరీశ్ చురకలంటించారు. సోనియాను అవమానించిన వ్యక్తినే పీసీసీ చీఫ్‌గా నియమించి రాజకీయాలు చేయలేని స్థితిలో కాంగ్రెస్ వుందన్నారు. ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టిన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడయ్యాడని హరీశ్ దుయ్యబట్టారు. 

Latest Videos

ALso Read: నియోజకవర్గాల్లో అభ్యర్ధులే లేరు .. తెలంగాణలో ఆ పార్టీ గాలి వీస్తోందట : కాంగ్రెస్‌పై హరీశ్‌రావు సెటైర్లు

ఇకపోతే.. నిన్న తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. అభ్యర్ధులే లేని కాంగ్రెస్‌కు గాలి వీస్తోందా అని సెటైర్లు వేశారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నాని ఆయన ఆరోపించారు. చెరకు సుధాకర్ బీఆర్ఎస్‌లో చేరడం సంతోషకరమన్నారు. ఆయన కరడుగట్టిన తెలంగాణ ఉద్యమవాది అని హరీశ్ రావు ప్రశంసించారు.

తెలంగాణ ఉద్యమంలో సుధాకర్ తీవ్రంగా శ్రమించారని మంత్రి గుర్తుచేశారు. ఉద్యమ సమంలో రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయిన వ్యక్తి ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు అంటూ కిషన్ రెడ్డిపై విమర్శలు చేశారు హరీశ్ రావు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ఘనత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిదన్నారు. రేవంత్ రెడ్డి సీట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారని హరీశ్ రావు చురకలంటించారు. సోనియాను అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. 

కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని.. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తోందని హరీశ్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ గెలవాలి.. తెలంగాణ అభివృద్ధి పరుగులు  పెట్టాలని హరీశ్ రావు ఆకాంక్షించారు. పనితనం తప్ప.. పగతనం లేని నాయకుడు కేసీఆర్ అని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ అంటేనే మాటలు, ముఠాలు, మంటలు అని హరీశ్ చురకలంటించారు. కేసీఆర్ హయాంలో కరువు, మత కలహాలు లేకుండా రాష్ట్రం ప్రశాంతంగా వుందని మంత్రి చెప్పారు. 

click me!