ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్‌పై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం.. ఈటల కీలక వ్యాఖ్యలు..

By Sumanth KanukulaFirst Published Aug 5, 2023, 11:32 AM IST
Highlights

రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో గవర్నర్‌పై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. 

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో గవర్నర్‌పై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. గవర్నర్‌కు ఒక్క రోజు ముందే బిల్లు పంపారని.. గవర్నర్ బిల్లు చూడాలి, చదవాలి, సంతకం చేయాల్సి ఉంటుందని చెప్పారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ హైదరాబాద్‌లో అందుబాటులో లేరు అని చెబుతున్నా.. ప్రభుత్వం హడావుడి చేస్తోందని విమర్శించారు. ఈటల రాజేందర్ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. గెస్ట్ లెక్చరర్స్, సెకండ్ ఏఎన్‌ఎంలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మహిళా సంఘాలు అనేక మంది తమ సమస్యలు చెప్పుకుందామంటే ఎవరు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వారికి మంత్రులు, అధికారులు భరోసా ఇవ్వడం లేదన్నారు. 

సీఎం కేసీఆర్ ఎవరికి అందుబాటులో ఉండరని విమర్శించారు. సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ నిర్వహించాల్సి ఉంటుందని.. కానీ మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఒకరోజు హరీష్ రావు, ఒకరోజు కేటీఆర్ దాడి చేశారని.. రేపు కేసీఆర్ దాడి చేస్తారని అన్నారు. ఆర్టీసీలో సంస్థకు సంబంధించి 6 వేల బస్సులు మాత్రమే నడుస్తున్నాయని అన్నారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఆర్టీసి కార్మికులకు రెండు పీఆర్‌సీలు బకాయిలు పడ్డారని తెలిపారు. 

Latest Videos

ఆర్టీసిలో పనిచేసే ఇతర సిబ్బందిని కూడా పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌కు ఆర్టీసి బిల్లు మొన్ననే పంపారు.. అందుబాటులో లేరని చెబుతున్నప్పటికీ.. బట్టకాల్చి మీదేసినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు.  ఆర్టీసీ కార్మికులను బలవంతంగా గవర్నర్ కార్యాలయం ముందు ధర్నాకు తీసుకువస్తున్నారని అన్నారు. ఆర్టీసి కార్మికులు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. వచ్చే ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పుకొచ్చారు. 

click me!