ఎల్బీ నగర్‌లో గిరిజన మహిళపై పోలీసుల దాడి: ఇద్దరిని సస్పెండ్ చేసి సరిపెట్టారు: ఈటల రాజేందర్

By Mahesh K  |  First Published Aug 19, 2023, 4:58 PM IST

ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్‌లో ఓ గిరిజన మహిళను విచారణ చేస్తామని రాత్రిపూట తీసుకెళ్లి తీవ్రంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల దాడికి గురైన ఆ మహిలకు సానుభూతిగా పెద్దమందిలో ఆందోళనబాట పడుతున్నారు. ఈ ఘటనపై ఈటల రాజేందర్ స్పందిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
 


హైదరాబాద్: ఎల్బీనగర్ పీఎస్‌లో ఓ గిరిజన మహిళను విచారణ పేరిట దారుణ హింసకు గురి చేసిన ఘటన కలకలం రేపింది. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రజా సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఆందోళనబాట పట్టాయి. ఈ సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసి ప్రభుత్వ పెద్దలు సరిపెట్టుకున్నారని అన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహిళపై దాడి ఘటనలో కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి సరిపెట్టారని అన్నారు. దళిత, గిరిజన మహిళలపై దాడులు జరుగుతుంటే సీఎం కేసీఆర్ స్పందించనైనా లేదని ఆగ్రహించారు. ఎల్బీ నగర్ ఘటనతోపాటు గతంలోనూ దళిత మహిళలపై జరిగిన దాడులను, ఆ సందర్భంలో ప్రభుత్వం మిన్నకుండిపోయిందని విమర్శలు చేశారు.

Latest Videos

Also Read: టికెట్ 100 శాతం నాకే వస్తుంది.. లిస్ట్ వచ్చేదాకా ఆగండి: మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి

గతంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో మరియమ్మ అనే దళిత మహిళపై దాడి జరిగిందని, ఆ దాడిలో ఆమె మరణించిందని ఈటల రాజేందర్ అన్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని వచ్చిన డిమాండ్లను ప్రభుత్వం ఖాతరు చేయలేదని చెప్పారు. ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసిన ఘటన, కరీంనగర్‌లోనూ హింసను చూశామని ఈటల అన్నారు. వీటన్నింటినీ ప్రజలు లెక్కపెట్టుకుంటున్నారని, వారి మనస్సులో ఈ ఘటనలు ఉంటాయని పేర్కొన్నారు. సీఎం నియోజకవర్గం గజ్వేల్‌లోనూ సాయం చేయాలని దళితులు ఆందోళనలకు దిగితే వారిని భయపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

click me!