టీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా

By narsimha lodeFirst Published Jun 4, 2021, 10:15 AM IST
Highlights

టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా మాజీ మంత్రి ఈటల రాజేందర్  తెలిపారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా మాజీ మంత్రి ఈటల రాజేందర్  తెలిపారు.  అంతేకాదు ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన వివరించారు.మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు షామీర్ పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 19 ఏళ్లపాటు టీఆర్ఎస్‌తో తనకు  ఉన్న అనుబంధాన్ని ఇవాళ్టితో వీడుతున్నట్టుగా ఆయన ప్రకటించారు.

 అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్ధుల్లో  తాను కూడ ఒకడినని ఆయన చెప్పారు. 2014 కంటే ఎక్కువ మెజారిటీతో హుజూరాబాద్ నుండి తాను విజయం సాధించినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఎంపీ పదవికి కవితతో పాటు చాలా మంది టీఆర్ఎస్ నేతలు 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని ఆయన గుర్తు చేశారు. 

ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడ చివరి కోరిక ఏమిటని కూడ అడుగుతారన్నారు.  కానీ తనపై వచ్చిన ఆరోపణల విషయంలో కనీసం తనను వివరణ అడగకుండానే మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేశారని ఆయన చెప్పారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా రాత్రికే రాత్రికే మంత్రివర్గం నుండి తొలగించారని ఆయన గుర్తు చేశారు. ఎవరో అనామకుడు లేఖ రాస్తే మంత్రిపై విచారణ జరిపారన్నారు. ఈ విషయమై కనీసం తన వివరణ కూడ అడగలేదన్నారు. 


హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో వంద శాతం ప్రజా ప్రతినిధులను గెలిపించుకొన్నామన్నారు. ప్రజల హృదయాల్లో  స్థానం సంపాదించుకొన్నానని ఆయన చెప్పారు.   హుజూరాబాద్ ప్రజల మద్దతు తనకు ఉందన్నారు.  పార్టీ ఏ పదవి అప్పగించినా తన  శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేశానని ఆయన చెప్పారు. 
 

click me!