
తన విజయాన్ని హుజురాబాద్ (huzurabad bypoll) ప్రజలకు అంకితం చేస్తున్నా అన్నారు బీజేపీ (bjp) నేత ఈటల రాజేందర్ (etela rajender). హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. బెదిరింపులకు ప్రజలకు భయపడేది లేదని.. ఉపఎన్నికలో భారీగా డబ్బులు, మద్యం పంపిణీ చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు. హుజురాబాద్‌లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్ధితి తెచ్చారని ఆయన అన్నారు. ప్రజలను ప్రలోభ పెట్టేందుకు యత్నించారని ఈటల రాజేందర్ ఆరోపించారు.
వాళ్లు డబ్బు సంచులు, అక్రమాలు, అన్యాయాన్ని నమ్ముకున్నారని ఈటల ఆరోపించారు. అమెరికాలో ఉన్నా, లండన్‌లో ఉన్నా, సూరత్‌లో ఉన్నా ఉప ఎన్నిక కోసం ఉత్కంఠగా ఎదురు చూశారని రాజేందర్ అన్నారు. కేసీఆర్ అహంకారం పోవాలని కోరుకున్నారని.. ఉప ఎన్నికలో చివరికి కుల ఆయుధం కూడా ఉపయోగిస్తారని ఈటల మండిపడ్డారు. రకరకాల పథకాలతో ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేశారని.. 75 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో ఇష్టారీతిన డబ్బులు ఖర్చు చేశారని రాజేందర్ ఆరోపించారు.
శ్మశానంలో డబ్బులు పంచుతున్నా అధికారులు పట్టించుకోలేదని.. పోలీసులే దగ్గరుండి డబ్బులు పంపిణీ చేయించారని ఆయన వ్యాఖ్యానించారు. రేపటి నుంచి ఐదు అంశాలపై నా పోరాటం కొనసాగుతోందన్నారు. దళిత బంధును తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానని.. మిగిలిన కులాలకు కూడా దళితబంధు మాదిరిగా ఆర్థిక సాయం చేయాలని ఈటల డిమాండ్ చేశారు. స్థలాలు ఉన్న వారు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు ఇవ్వాలని.. తెలంగాణ నినాదం.. నీళ్లు, నిధులు, నియామకాలేనని రాజేందర్ గుర్తుచేశారు. నిరుద్యోగ భృతి ప్రకటించిన విధంగా నెలకు రూ.3,016 లు ఇవ్వాలి, 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలి, రైతాంగం పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి అని ఈటల డిమాండ్ చేశారు.
కాగా, అధికార తెరాస వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ.. మంత్రి హరీశ్ రావు ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ.. గులాబీ మంత్రుల విమర్శలకు ప్రతివిమర్శలతో సమాధానమిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన హుజూరాబాద్ సింహాసనాన్ని ఎట్టకేలకు భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ దక్కించుకున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఏడోసారి విజయం సాధించారు. సిట్టింగ్ స్థానంలో మరోసారి గెలుపుబావుటా ఎగురవేసి తన సత్తా చాటారు. అధికార పార్టీ నుంచి వీడి.. కమలతీర్థం పుచ్చుకున్న ఈటల కాషాయం కండువాతో శాసనసభలో అడుగుపెట్టనున్నారు.
ALso Read:హుజురాబాద్ ఫలితాలు కేసీఆర్ నెక్ట్స్ ఏం చేయనున్నారు.. ముందస్తు ఎన్నికలకు వెళ్తారా..?
తెరాసలో ఏడేళ్లు మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్‌కు ఆ పార్టీ అధిష్టానానికి పొసగలేదు. పదవి తనకు ప్రజలు పెట్టిన భిక్షంటూ ఈటల బాహాటంగానే పలుసార్లు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలపైనా సునిశిత విమర్శలు చేశారు. ధనికులకు రైతు బంధు పథకం అమలు సహా గొర్రెలు, బర్రెలు పంపకాలపై అసంతృప్తి వెలిబుచ్చారు. ఓ మంత్రిగా ఈటల అసంతృప్తి తెరాస పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. ఈటల భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ అధిష్ఠానం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసింది. అసైన్డ్ భూములు ఆక్రమించారంటూ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ఈ పరిణామాలన్నీ ముందే అంచనా వేసిన ఈటల రాజేందర్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అధికారపక్షాన్ని ఢీ కొట్టాలని నిర్ణయించుకున్నారు. భాజపాలో చేరి తెరాసకు సవాల్ విసిరారు.
అప్పటి నుంచి ఇటు అధికార తెరాస, అటు ఇతర పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయినా ఎక్కడా ధైర్యం కోల్పోకుండా.. ప్రజలే అండగా ముందుకు సాగారు. నియోజకవర్గంలో తనకంటూ జనబలాన్ని ఏర్పరుచుకుని.. ప్రజలే తన బలమని చెబుతూ చివరకు అదే నిజమని నిరూపించారు. వామపక్ష భావజాలం గలిగిన ఈటల రాజేందర్ భాజపాలో చేరడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. భూ కబ్జా కేసుల నుంచి బయటపడేందుకే కాషాయ కండువా వేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. వాటన్నింటికి సమాధానమిచ్చిన రాజేందర్.. ప్రస్తుత రాజకీయ పరిణమాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రణక్షేత్రంలోకి దిగారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల మనసులను చూరగొన్నారు. గడపగడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. స్థానిక నేతగా తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఉద్యమ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ తనకు అన్యాయం జరిగిందని ఏకరువు పెట్టారు.