పొంగులేటి, జూపల్లిలతో ఈటల భేటీ.. గన్‌మెన్లు కూడా లేకుండా రహస్యంగా సమావేశం కావడం వెనక కారణమేమిటి..?

By Sumanth KanukulaFirst Published May 26, 2023, 9:36 AM IST
Highlights

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రహస్యంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

తెలంగాణ చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరనున్నారనే చర్చ గత కొంతకాలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే వీరితో బీజేపీ నేతలు చర్చలు జరిపారు. టీ బీజేపీ చేరికల కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఈటల రాజేందర్.. మరికొందరు పార్టీ నేతలతో కలిసి ఖమ్మం వెళ్లి పొంగులేటి, జూపల్లితో భేటీ అయ్యారు. ఇరువురు నేతలను బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. మరోవైపు కాంగ్రెస్ కూడా తెరవెనక పొంగులేటి, జూపల్లిలతో చర్చలు జరుపుతోంది. కానీ ఏ పార్టీ చేరతారనే విషయంపై ఇరువురు నేతలు క్లారిటీ ఇవ్వడం లేదు. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగింది. పార్టీలో చేరికకు సంబంధించి కొన్ని డిమాండ్లను కూడా పెట్టారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రచారంపై పొంగులేటి, జూపల్లి స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే వారు సొంతంగా పార్టీ పెడతారా? అనే చర్చ కూడా తెరమీదకు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈటల రాజేందర్.. తాజాగా పొంగులేటి, జూపల్లిలతో రహస్యంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ శివార్లలో ఓ ఫామ్‌హౌస్‌లో గురువారం ఈ సమావేశం జరిగింది. 

అయితే ఈ సమావేశంలో ముగ్గురు నేతలు మాత్రమే పాల్గొన్నారని.. గన్‌మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండా చాలా రహస్యంగా ఈ సమావేశం సాగిందని సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించడంతో పాటు.. పొంగులేటి, జూపల్లిలను బీజేపీలో ఆహ్వానించారని చెబుతున్నారు.

అయితే ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన ఈటల రాజేందర్.. అధిష్టానం ఆదేశాలతో రాష్ట్రంలో బీజేపీలోకి చేరికల ప్రక్రియను వేగవంతంపై చేయడంపై దృష్టిసారించినట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి పొంగులేటి, జూపల్లిలతో సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ రాజకీయ కార్యాచరణ ప్రణాళికలను వారికి వివరించినట్టుగా సమాచారం. అయితే గతంలో పలువురు నేతలతో కలిసి.. బహిరంగంగానే పొంగులేటి, జూపల్లిలతో భేటీ అయిన ఈటల.. ఇప్పుడు మాత్రం రహస్యంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 

click me!