సీఎం కేసీఆర్‌తో అంటకాగేవారిని ప్రజలు క్షమించరు.. ఈటల రాజేందర్

By Sumanth KanukulaFirst Published Aug 21, 2022, 6:13 PM IST
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అంటకాగేవారిని, పొత్తు పెట్టుకునేవారిని తెలంగాణ ప్రజలు క్షమించరని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అంటకాగేవారిని, పొత్తు పెట్టుకునేవారిని తెలంగాణ ప్రజలు క్షమించరని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. మునుగోడులో బీజేపీ బహిరంగ సభలో ఈటల రాజేందర్ మాట్లాడారు. మోటర్లకు మీటర్లు పెడతామని కేంద్రం ఎప్పుడు చెప్పలేదని అన్నారు. కేసీఆర్ దుర్మార్గాలను తిప్పికొట్టే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వాలంటీర్లను ఇప్పటివరకు రెన్యువల్ చేయలేదన్నారు. వేల మంది వీఆర్‌వోలను తొలగించి వారి పొట్ట కొట్టారని విమర్శించారు. 

పోడు రైతులకు పట్టాలిచ్చే దమ్ము మీకుందా అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. కార్మికులు, పేద ప్రజల సమస్యల పరిష్కారంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులకు రుణాలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. హుజురాబాద్ కంటే మునుగోడు చైతన్యవంతమైన గడ్డ అని అన్నారు. టీఆర్ఎస్ ఓడిపోతే ఇక్కడ మీటర్లు పెడతారని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సభ విజయవంతం కావద్దని కేసీఆర్ కుట్ర చేసి.. ఒక్క రోజు ముందు సభ పెట్టారని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేత ప్రధాని మోదీ అని చెప్పారు. ఈ ఎనిమిదేళ్లలో సీపీఐ నేతలు ఎప్పుడైనా ప్రగతిభవన్‌కు వెళ్లారా అని ప్రశ్నించారు. 

8 ఏళ్లలో ఎప్పుడైనా ట్రేడ్ యూనియన్లతో కేసీఆర్ చర్చించారా అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ధర్నాలే ఉండొద్దని కేసీఆర్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్‌ను ఎత్తేశారని అన్నారు. కేసీఆర్ చేసిన ద్రోహాలు కమ్యూనిస్టు మర్చిపోయారా అని ప్రశ్నించారు. వామపక్ష పార్టీలు ఒకసారి ఆలోచన చేయాలని అన్నారు. 

click me!