సీబీఐ, ఈడీ అంటే కేసీఆర్‌కు లోలోపల భయం.. దొర మాటల్ని ఈసారి జనం నమ్మరు : విజయశాంతి

By Siva KodatiFirst Published Aug 21, 2022, 5:41 PM IST
Highlights

టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా వచ్చిందని.. దొర ఎన్నిమాటలు చెప్పినా ఈసారి ప్రజలు మోసపోరని తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి స్పష్టం చేశారు. రైతుల్ని, దళితుల్ని కేసీఆర్ మోసం చేశారని రాములమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి. ఆదివారం మునుగోడులో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. పాత ప్రాజెక్ట్‌లకే కొత్త పేరు పెట్టి వేల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. రైతుల్ని, దళితుల్ని కేసీఆర్ మోసం చేశారని రాములమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను స్క్రాప్ ప్రాజెక్ట్‌గా తయారు చేశారని విజయశాంతి ఆరోపించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల సమస్యలు పరిష్కరించలేకపోయారని ఆమె ఎద్దేవా చేశారు. మోడీ కేసీఆర్‌కు శత్రువని.. ప్రజలకు మిత్రుడని విజయశాంతి అన్నారు. సీబీఐ, ఈడీ అంటే కేసీఆర్‌కు లోలోపల భయమని ఆమె సెటైర్లు వేశారు. టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా వచ్చిందని.. దొర ఎన్నిమాటలు చెప్పినా ఈసారి ప్రజలు మోసపోరని విజయశాంతి స్పష్టం చేశారు. 

ALso Read:విద్యుత్ చట్టాలపై అమిత్ షాను రైతులు నిలదీయలేదు.. అవన్నీ కేసీఆర్ లీకులే : బండి సంజయ్ క్లారిటీ

అంతకుముందు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ఎక్కడ కాలు పెడితే అక్కడ వినాశనమేనన్నారు. కర్ణాటకలో కుమారస్వామిని కేసీఆర్ కలిసిన ఆర్నేళ్లకే ఆయన సీఎం కుర్చీ దిగిపోయారంటూ రఘునందన్ రావు సెటైర్లు వేశారు. మహారాష్ట్ర వెళ్లి ఉద్ధవ్ థాక్రేను కేసీఆర్ కలిశారని.. ఆయన కూడా కుర్చీలో లేడన్నారు. కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనపై ఆయనకే నమ్మకం లేదని.. అందుకే సూది దబ్బలం పార్టీలైన కమ్యూనిస్ట్‌లతో జతకట్టారని రఘునందన్ రావు విమర్శించారు. 

తెలంగాణలో సీపీఐకి ఏమైనా ఓట్లు వున్నాయా అని ఆయన ప్రశ్నించారు. సీపీఐ గుర్తు మీద గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేని కూడా టీఆర్ఎస్ ఎత్తుకుపోయిందని రఘునందన్ ఎద్దేవా చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, విలేజ్ సెక్రటరీలు.. ఉపాధి హామీ పథకం పనులు వున్నాయని జనాన్ని పిలిపించారని ఆయన ఆరోపించారు. బీజేపీ గెలిస్తే మోటర్లకు మీటర్లు వస్తాయని కేసీఆర్ చెబుతున్నారని.. కానీ, దీనిపై పార్లమెంట్‌లో బిల్లు పాసైందా, జీవో ఏమైనా ఇచ్చామా అన్న విషయాన్ని కేసీఆర్ చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. 

click me!