మంత్రి ఈటల పై చిన్నచూపు

First Published Aug 7, 2017, 2:24 PM IST
Highlights
  • ఈటల అధికారాల్లో కోతలు
  • జిఎస్టీ సమావేశానికి ఈటల దూరం
  • ఈటల స్థానంలో కెటిఆర్ ఢిల్లీకి
  • పోచంపాడు జన సమీకరణ బాధ్యతల అప్పగింత
  • ఫైనాన్స్ మంత్రి విధుల్లో చొరబాట్లు

తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి ఈటల రాజేందర్ పట్ల చిన్నచూపు ఉందా? ఉత్తుత్తి పనులు మాత్రమే ఆయనకు అప్పగిస్తున్నారా? తన సొంత శాఖలోని పనులు సైతం పెద్దాయన ఫ్యామిలీ గుంజుకుపోతున్నదా? అంతిమంగా ఈటల అధికారాలకు కత్తెర పెడుతున్నారా? అంటే టిఆర్ఎస్ శ్రేణుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ పాత్ర ఘనమైనదే. టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఈటెల కెసిఆర్ వెన్నంటే ఉన్నారు. ఉద్యమంలోనే పనిచేశారు. రాజీనామాలు చేయాల్సి వచ్చినా కెసిఆర్ అడుగులో అడుగు వేస్తూ నడిచారు. పూర్వాశ్రమంలో లెఫ్ట్ భావజాలం ఉన్న ఈటల టిఆర్ఎస్ పార్టీలోనూ అందరిని కలుపుకుపోవడంలో లెఫ్టిస్టుగానే పనిచేశారు. 

ఉమ్మడి రాష్ట్రంలో టిఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఈటల  పని తీరును టిఆర్ఎస్ నేతలు, తెలంగాణవాదులే కాదు సీమాంధ్ర నేతలు కూడా మెచ్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈటల మాటలు అసెంబ్లీలో నేటికీ ప్రతిధ్వనిస్తాయి. తెలంగాణ ఆవశ్యకతపై ఆయన చేసిన ప్రసంగాలు సీమాంధ్ర నేతలను గుక్క తిప్పుకోనివ్వలేదని చెబుతారు. ఆయన మృదు స్వభావి... కానీ మాట్లాడితే కదనరంగంలో ఈటెలు గుచ్చినట్లే ఉంటాయని చెబుతారు. పట్టుమని పది సీట్లు గెలవలేదు... తల ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్రా? నీకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతుందా? అన్న సీమాంధ్ర నేతల అహంకారపూరిత అవమానాలను సైతం తెలంగాణ సాధన కోసం పంటి బిగిన భరించిన నేత ఈటెల రాజేందర్. టిఆర్ఎస్ వరుస రాజీనామాలు చేస్తున్నా మొక్కవోని ధైర్యంతో ఓటమి ఎరుగని నాయకుడిగా నిలిచారు ఈటల. 

తెలంగాణ స్వరాష్ట్రంలో ఈటల ఆర్థిక, పౌరసరఫరాల శాఖకు మంత్రిగా అయ్యారు. మూడేళ్లుగా ఇవే శాఖలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈటల అధికారాలకు కత్తెర పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఆయన తన శాఖలో కూడా తనకు నచ్చిన రీతిలో పనిచేయడం కష్టంగా మారిందన్న ప్రచారం సచివాలయ వర్గాల్లో జరుగుతున్నది. తాజాగా ఢిల్లీలో జరిగిన జిఎస్టీ సమావేశమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెబుతున్నారు. జిఎస్టీ సమావేశానికి ఆర్థిక మంత్రిగా ఈటల ఢిల్లీకి వెళ్లాలి. కానీ అనూహ్యంగా సిఎం తనయడు, మంత్రి కెటిఆర్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి ఎగిరిపోయారు. జిఎస్టీ సమావేశంలో పాల్గొన్నారు.

మరి ఈటల ఏం చేస్తున్నారు అన్న సందేహం కలగొచ్చు. ఆయనకు సిఎం కెసిఆర్ వేరే బాధ్యతలు అప్పగించారు. అవేంటంటే పోచంపాడు ప్రాజెక్టు తాలూకు బహిరంగసభ ఈనెల 10న జరుపుతున్నారు. ఆ సభ ఏర్పాట్ల బాధ్యతను సిఎం ఆయనకు అప్పగించారు. దీంతో ఈటల తన  శాఖ పరిధిలో ఢిల్లీలో జరుగుతున్న సమావేశాన్ని పక్కన పెట్టి పోచంపాడు సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అంగీకరించారు. ఈ విషయం ఎవరో చెప్పే మాట కాదు, సిఎం కార్యాలయం వెలువరించిన ప్రకటనలో ఉంది. 

శనివారం ఢిల్లీలో జరిగిన జిఎస్టీ సమావేశానికి ఈటల గైర్హాజరు, కెటిఆర్ హాజరు చకచకా జరిగిపోయాయి. ఈటల మాత్రం పోచంపాడు ప్రాజెక్టు సభ పనుల్లో తలమునకలయ్యారు. నిజానికి ఒకరోజు జిఎస్టీ సమావేశానికి ఢిల్లీకి వెళ్లివచ్చినంత మాత్రాన పోచంపాడు సభ ఫెయిల్ అయ్యే అవకాశం ఏమీ లేదు. కానీ ఈటలను కాకుందా తనయుడు కెటిఆర్ ను జిఎస్టీ సమావేశానికి పంపే ఉద్దేశంతోనే ఈ తతంగం నడిచిందన్న ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ స్థాయిలో కెటిఆర్ ను ప్రొపెక్ట్ చేసే పనిలో భాగంగానే ఆ సమావేశానికి పంపినట్లు చెబుతున్నారు.

మొత్తానికి ఈటల రాజేందర్ శాఖలో అవసరమైతే పెద్దాయన కుటుంబం జోక్యం చేసుకుంటది అన్న ప్రచారం వాస్తవమేనని తాజా ఘటనతో తేలిపోయిందంటున్నారు పార్టీ నేతలు. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ తర్వాత నాయకుడు ఎవరంటే ఈటల పేరు చెప్పేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పాటైన ప్రభుత్వంలో మాత్రం ఈటల ర్యాంకు ఎక్కడ ఉంటుందో ఎవరూ చెప్పలేరని అంటున్నారు.

click me!