
తెలంగాణకు చెందిన ఒక మంత్రి పక్కా రూల్స్ పాటించారు. తెలుగు నేల మీద చాలా మంది మంత్రులు రూల్స్ గీల్స్ జాన్తా నై అని అంటున్న తీరు మనం చూస్తునే ఉన్నాం. రెండు రాష్ట్రాల్లో కలిపి డజను మంత్రులు అరాచకాలకు పెట్టింది పేరుగా ఉన్నారు. రౌడీఇజం చేసి హల్ చల్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు.
ఇక విషయానికి వస్తే తెలంగాణకు చెందిన అటవీ శాఖ మంత్రి జోగు రామన్న హెల్మెట్ ధరించి బైక్ నడిపి అందరి దృష్టిని ఆకర్షించారు. రాఖీ కట్టండి.. హెల్మెట్ బహుమతిగా ఇవ్వండి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇచ్చిన నినాదం ఆదిలాబాద్ లో అమలుపరిచారు.
ఆదిలాబాద్ జిల్లా జాగృతి అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నకు శనివారం ఆదిలాబాద్‌లో రాఖీ కట్టి.. హెల్మెట్‌ను బహూకరించారు. ఈ హెల్మెట్ ధరించి మంత్రి జోగు రామన్న బుల్లెట్ ద్విచక్ర వాహనాన్ని నడిపారు. మంత్రి జోగు రామన్న స్వయంగా హల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపి పలువురికి ఆదర్శంగా నిలిచారు.
మొన్నటికి మొన్న ఒక తెలంగాణ మంత్రి ఇలాగే బుల్లెట్ మీద వీధుల్లో తిరుగుతూ హల్ చల్ చేసిండు. కానీ ఆయన హెల్మెట్ ధరించలేదు. దాంతోపాటు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసిండు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆ అనుభవంతోనో లేక మరేమో కానీ జోగు రామన్న మాత్రం జిల్లా కేంద్రంలో హెల్మెట్ ధరించి బెల్లెట్ మీద ప్రయాణించడం మంచిదే కదా?