
పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుకు ధర్మ సంకటం ఎదురైంది. ఆయన టిడిపి శాసనసభా పక్ష నేతగా ఉండి గత ఏడాది టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కానీ టిఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత తనకున్న పాపులారిటీ తగ్గిందన్న ప్రచారం అటు నియోజకవర్గంలో ఇటు పార్టీలో ఉంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి పైన పటారం అన్న రీతిలో ఉందని ఆయన ఫాలోయర్లు చెబుతన్నమాట.
టిడిపి శాసనసభా పక్షాన్ని విలీనం చేస్తూ ఆయనతోపాటు మరికొందరిని టిఆర్ఎస్ లోకి తీసుకొచ్చారు ఎర్రబెల్లి. ఎర్రబెల్లికి హోంశాఖ మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం తొలుత జరిగింది. నాయిని నర్సింహ్మారెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించి ఆ స్థానాన్ని ఎర్రబెల్లికి ఇస్తారని పార్టీలో చర్చ జరిగింది. కానీ అది ఇప్పటి వరకు ఆచరణ సాధ్యం కాలేదు. ఒకవేళ ఎర్రబెల్లికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ఎవరో ఒకరిని తొలగించక తప్పని పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతానికి తెలంగాణలో రాజ్యాంగం ప్రకారం 18 మంది మంత్రులకు మించరాదు.
ఇప్పటికే వెలమ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో భారీ సంఖ్యలో ఉన్నారు. సిఎం వెలమ, తనయుడు కెటిఆర్, అల్లుడు హరీష్ వీళ్లు ముగ్గురు ప్రధానమైన శాఖల్లో ఉండగా మరో ప్రధానమైన శాఖలో వెలమ సామాజికవర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు ఉన్నారు. దీంతో నలుగురు వీరే ఉండడం, ఉన్న వెలమ మంత్రుల్లో ఎవరినీ తొలగించే వాతావరణం లేకపోవడంతో ఎర్రబెల్లికి ఇబ్బంది తప్పలేదని తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ మంత్రిమండలిలో పెద్దగా మార్పులు, చేర్పులేమీ ఉండకపోవచ్చని పార్టీ నేతలు అంటున్నారు. ఎందుకంటే ఎపిలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన తర్వాత అల్లర్లు చెలరేగి చంద్రబాబుకు తలనొప్పులు తెచ్చిపెట్టాయి. దీంతో మంత్రివర్గాన్ని కదిలించే ఆలోచన కూడా కెసిఆర్ చేయడంలేదని చెబుతున్నారు. మరి ఎర్రబెల్లికి ఏ కోశాన చూసినా వచ్చే ఎన్నికల కంటే ముందు మంత్రి అయ్యే యోగం రాసి పెట్టిలేనట్లేనని పార్టీలో, నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్నమాట.
ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎంపి కవిత చేపట్టిన సిస్టర్ ఫర్ చేంజ్ ప్రోగ్రాం వరంగల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా ఎర్రబెల్లికి ధర్మసంకటం ఎదురైంది. ఆయనకు ఒక విద్యార్థిని రాఖీ కట్టి హెల్మెట్ అందజేసింది. ఎర్రబెల్లి బైక్ నడపరు. హెల్మెట్ ఎందుకబ్బా అని సోషల్ మీడియాలో సదరాగా చర్చ సాగుతోంది. ఆయన గతంలో ఉన్న పార్టీలో సైకిల్ గుర్తు కాబట్టి అక్కడా హెల్మెట్ అవసరం లేదు. ఇప్పుడున్న పార్టీది కారు గుర్తు కాబట్టి ఇక్కడా హెల్మెట్ అవసరం లేదు. మరి 2019 ఎన్నికల నాటికి బైక్ గుర్తతో ఏదైనా పార్టీ వస్తే అక్కడికి వెళ్తి హెల్మెట్ వాడుతారేమోనని కొందరు నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అన్నింటికంటే ఇదే ఎర్రబెల్లికి పెద్ద ధర్మ సంకటం అని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.