
Telangana Assembly Elections: తెలంగాణ రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. ప్రచార పర్వం సాగుతుంటే.. మరో వైపు నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇంకోవైపు.. నేతల విమర్శ ప్రతివిమర్శలతో ఎన్నికల సమరం మరింత హీటెక్కుతోంది. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) కాంగ్రెస్ పై విరుచుకపడ్డారు. తనపై పోటీ చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదని, అందుకే ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకున్న అభ్యర్థులను తనపై పోటీకి దించుతున్నారని ఎద్దేవా చేశారు. తనపై పోటీ చేసేందుకు ఎవరు సిద్ధంగా లేరని, అందుకే విదేశాల నుంచి వచ్చిన వారికి టికెట్ ఇచ్చారని ఎర్రబెల్లి విమర్శించారు.
ఉమ్మడి వరంగల్ లోని పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఓటమి అంటూ ఎరుగని ఎర్రబెల్లి దయాకర్ రావును ఈ సారి ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. మంత్రి ఎర్రబెల్లికి కంచుకోటగా ఉన్న పాలకుర్తి నియోజకవర్గంలో ఓ ఎన్నారై అభ్యర్థిని రంగంలోకి దిగింది.తొలుత ఎర్రబెల్లిపై ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ, పౌరసత్వ సమస్య వస్తుందని ఆమె కోడలు యశస్విని రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించారు. కాంగ్రెస్ అభ్యర్తిగా అవకాశం పొందిన యశస్విని రెడ్డి కూడా ప్రచారంలో దూసుకపోతుంది. దీంతో పోటీ ఆసక్తికరంగా మారింది.
డబుల్ హ్యాట్రిక్ కొట్టి ఎర్రబెల్లి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 1983లో టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత వరంగల్ డిసిసిబి అధ్యక్షునిగా పని చేశారు. వరంగల్ జిల్లాకు రేషన్ డీలర్స్ గౌరవ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం 1994 అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి.. గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. 1999, 2004లో కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు.2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో వర్ధన్నపేట ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానంగా మారింది. అప్పటివరకు ఉన్న చెన్నూరు నియోజకవర్గం పాలకుర్తిగా మారింది. అప్పటి నుంచి పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2009,2014, 2018 ల్లో వరుస విజయాలను సాధించారు.