
ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. దీనిలో భాగంగా సాధారణ డిగ్రీలోనూ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రయోగాత్మకంగా తొలి విడతగా 10 డిగ్రీ కాలేజీలను ఇందుకోసం ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ కోర్సుల కోసం ముందుకు వచ్చే ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు అనుమతి కూడా ఇవ్వనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందని సమాచారం. దీని ప్రకారం బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి సబ్జెక్ట్‌లను ప్రవేశపెడతారు. దీనికి సంబంధించి ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని పలు వర్సిటీ వీసీలు కూడా హాజరయ్యారు.