ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో అరెస్టైన శరత్ చంద్రారెడ్డి సతీమణి విమానసంస్థ కార్యకలాపాలపై ఆరా తీసింది. ఈ కేసుతో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయనే విషయమై ఈడీ దర్యాప్తు చేస్తుంది.
న్యూఢిల్లీ:ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరింత లోతుగా విచారిస్తుంది. ఈ కేసులో అరెస్టైన శరత్ చంద్రారెడ్డి సతీమణి కనికకు సంబంధించిన విమానసంస్థ కార్యకలాపాలపై ఈడీ ఆరా తీస్తుంది. ఈ విమానసంస్థ ద్వారా ఢిల్లీకి తెలుగు రాష్ట్రాలు తిరిగిన వారి వివరాలను ఈడీ సేకరించింది. ఈ విషయాలపై ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డితోపాటు వినయ్ బాబులను ఈడీ అధికారులు ఈ నెల 10వ తేదీన అరెస్ట్ చేశారు. అంతకు ముందు మూడు రోజులుగా వీరిద్దరిని విచారించారు. శరత్ చంద్రారెడ్డిని ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో మూడు రోజులపాటు ఈడీ అధికారులు విచారించారు. అయితే ఈ విచారణ సమయంలో శరత్ చంద్రారెడ్డి విచారణకు సహకరించలేదని ఈడీ అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. ఈడీ అధికారులు శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను కస్టడీలోకి తీసుకుని విచారించారు. వీరి కస్టడీ పూర్తైంది. ఇవాళ కోర్టులో ఈడీ అధికారులు వీరిద్దరిని ప్రవేశపెట్టనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి సిండికేట్ గా ఏర్పడినట్టుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆర్ధిక లావాదేవీలు ఎలా జరిగాయనే విషయమై ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు శరత్ చంద్రారెడ్డి భార్య నిర్వహిస్తున్న విమాన సంస్థ ద్వారా ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్లారనే విషయాలపై ఈడీ దృష్టి పెట్టిందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో హైద్రాబాద్ కు చెందిన అరుణ్ రామచంద్రపిళ్లైపై సీబీఐ ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఫెమా ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయనే అనుమానాలున్నాయి. దీంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు.
ఈ కేసులో తెలుగు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు పలు దఫాలు సోదాలు నిర్వహించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో విచారణ చేశారు. హైద్రాబాద్ లో పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హైద్రాబాద్ లోని చార్టెడ్ అకౌంటెంట్ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన సమయంలో కీలక సమాచారాన్ని ఈడీ అధికారులు సేకరించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ కు సంబంధాలున్నాయని బీజేపీ ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను టీఆర్ఎస్ ఖండించింది. ఉద్దేశ్యపూర్వకంగానే తమపై బీజేపీ ఈ ఆరోపణలు చేస్తుందని టీఆర్ఎస్ తెలిపింది. మరో వైపు ఇదే కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.మరో వైపు ఇదే కేసులో బోయినపల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ లు కూడా అరెస్టయ్యారు