కార్వీ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. బెంగళూరులో కార్వీ చైర్మన్ పార్థసారథి అరెస్ట్

By Sumanth KanukulaFirst Published Jan 24, 2022, 11:24 AM IST
Highlights

కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( Enforcement Directorate) దూకుడు పెంచింది. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) పార్థసారథిని ( Parthasarathy) ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( Enforcement Directorate) దూకుడు పెంచింది. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) పార్థసారథిని ( Parthasarathy) ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరిట కార్వీ మోసాలకు పాల్పడింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు పార్థసారథిని బెంగళూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. పార్థసారథిని కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరాలని నిర్ణయించడంతో.. ఆయనను ప్రస్తుతం హైదరాబాద్ సిటీ జైలులో ఉంచినట్లు ED వర్గాలు తెలిపాయి. ఇక, పార్థసారథి కార్వీ రియాలిటీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కి డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.

కార్వీ సంస్థ వందల కోట్ల రూపాయలను నిబంధనలను విరుద్దంగా దారి మళ్లించడంపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇన్వెస్టర్ల అనుమతి లేకుండా వారి షేర్లను.. కార్వీ కంపెనీ డీమ్యాట్ ఖాతాలోకి బదిలీ చేయడమేకాకుండా.. వాటిని బ్యాంకుతో తాకట్టు పెట్టి రుణాలు పొందింది. అయితే ఆ రుణాలను అనుబంధ కంపెనీలకు మళ్లించినట్టుగా దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన నిందితుల షేర్లను ఈడీ కొద్ది నెలల కిందట స్తంభింపజేసింది.

కార్వీ సంస్థ తీసుకున్న మొత్తం రుణాలు దాదాపు 3,000 కోట్ల వరకు ఉంటాయని ఈడీ తెలిపింది. 2016-2019 మధ్యకాలంలో Karvy Stock Broking Limited తన గ్రూప్ కంపెనీ అయిన కార్వీ రియాల్టీ (ఇండియా) లిమిటెడ్‌కు 1,096 కోట్లను బదిలీ చేసిందని ప్రాథమిక విచారణలో నిర్దారణ అయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పార్థసారథి సూచనల మేరకు యాంటీ ఫోరెన్సిక్ సాధనాలను ఉపయోగించి సర్వర్‌ల నుంచి ఫైల్‌లు, ఈ మెయిల్స్‌ను తొలగించినట్లు ఈడీ తన విచారణలో కనుగొంది.

అంతకు ముందు ఈడీ అధికారులు కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌కు చెందిన ఆరు చోట్ల సోదాలు నిర్వహించారు. పార్థసారథి, ఆయన కుమారులు రజత్, అధిరాజ్‌‌లకు చెందిన కార్వీ గ్రూప్ షేర్లను ఈడీ స్తంభింపజేసింది. కార్వీ సంస్థ తన ఖాతాదారుల సెక్యూరిటీలను చట్టవిరుద్ధంగా తాకట్టు పెట్టి 329 కోట్ల రుణం తీసుకుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సీసీఎస్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దాని ఆధారంగా ఈడీ.. పీఎంఎల్‌ఏ కింద ఈసీఐఆర్ జారీ చేసింది. 

ఇక, IndusInd Bank‌ను రూ. 137 కోట్లు మోసం చేశారనే ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు కార్వీ డైరెక్టర్లపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్‌ను రూ. 562 కోట్లు మోసం చేసినందుకు గానూ సైబరాబాద్ పోలీసులు మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 

click me!