కరీంనగర్ జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. చార్జింగ్ పెట్టిన కొద్దిసేపటికే..

Published : May 09, 2022, 05:22 PM IST
కరీంనగర్ జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. చార్జింగ్ పెట్టిన కొద్దిసేపటికే..

సారాంశం

పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో కొందరు వాహనదారులు ఎలక్ట్రిక్ బైక్‌లను కొనుగోలు చేస్తున్నారు. అయితే పలుచోట్ల ఎలక్ట్రిక్ బైక్‌ల బ్యాటరీలు పేలుడు ఘటనలు చోటుచేసుకోవడంతో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ పేలింది.

పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో కొందరు వాహనదారులు ఎలక్ట్రిక్ బైక్‌లను కొనుగోలు చేస్తున్నారు. అయితే పలుచోట్ల ఎలక్ట్రిక్ బైక్‌ల బ్యాటరీలు పేలుడు ఘటనలు చోటుచేసుకోవడంతో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బైక్‌లు పేలి పలువురు మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ పేలింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను ఆర్పేశారు.

వివరాలు.. కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం రామచంద్రాపూర్‌లో ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ పేలింది. వివరాలు.. ఎగుర్ల ఓదెలు రెండు నెలల క్రితం బెన్లింగ్ ఫాల్కన్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశారు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి పడుకునే ముందు బ్యాటరీకి ఛార్జింగ్‌ పెట్టాడు. అయితే చార్జింగ్ పెట్టిన కొద్ది నిమిషాల్లోనే బ్యాటరీ ఆఫ్ అయిపోయింది. ఆ తర్వాత బ్యాటరీలో పేలుడు సంభవించింది. అయితే అదృష్టవశాత్తూ.. ఇంటి వెలుపల బ్యాటరీని ఛార్జింగ్ పెట్టడం.. పేలుడు జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదంతప్పింది. అయితే ఈ ఘటనలో వాహనం దగ్ధమైంది.

ఇక, గత నెలలో నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్ బైక్ పేలడంతో ఒకరు మృతిచెందగా.. ఇద్దరు గాయపడ్డారు. వివరాలు..బల్లా ప్రకాష్ తన కుమారులు, తల్లిదండ్రులతో కలిసి సుభాష్ నగర్‌లో నివసిస్తున్నాడు. అతను ఒకటిన్నర సంవత్సరాల క్రితం ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేశాడు. వాహనం నుంచి బ్యాటరీని తీసివేసిన తర్వాత.. అతను తన ఇంటి లోపల దానిని క్రమం తప్పకుండా ఛార్జ్ చేసేవాడు. 

రోజులాగే మెయిన్ హాల్‌లో బ్యాటరీని ఛార్జింగ్ పెట్టాడు. అక్కడ మంగళవారం ప్రకాష్ కుమారుడు కళ్యాణ్, తల్లిదండ్రులు రామస్వామి, కమలమ్మలు నిద్రించారు. ప్రకాష్, అతని భార్య కృష్ణవేణి మరో రూమ్‌లో నిద్రపోయారు. అయితే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బ్యాటరీ ఒక్కసారిగా పేలింది. పేలుడు శబ్దం విని ప్రకాష్ హాలులోకి వచ్చాడు. అక్కడ మంటలు, పొగ హాలును చుట్టుముట్టాయి. దీంతో వారంతా ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు.

అనంతరం.. గాయపడిన ముగ్గురిని వెంటనే నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. 80 ఏళ్ల రామస్వామి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. తీవ్ర గాయాలపాలైన రామస్వామి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ప్రకాష్ ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?