Election results : రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్.. ముందుగా ఆ ఓట్లు లెక్కింపు...

By SumaBala Bukka  |  First Published Dec 2, 2023, 8:43 AM IST

తెలంగాణలో ఓట్ల లెక్కింపుకు మరికొద్ది గంటలే మిగిలిఉంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడంచెల భద్రత మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది.


హైదరాబాద్ : ఆదివారం ఉదయం 8 గంటల నుంచి తెలంగాణలో ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజు తెలిపారు.  అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరగలేదని, పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు.  ఓట్ల లెక్కింపుకు సంబంధించి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. శుక్రవారం హైదరాబాద్ బీ ఆర్కే భవన్లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు తీసుకున్న జాగ్రత్తలను వివరించారు.

తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆదివారం డిసెంబర్ మూడో తేదీన జరగనుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా వికాస్ రాజు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూఢంచెల భద్రతను అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. 113 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు 14 టేబుళ్ల ద్వారా జరుగుతాయని,  500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Latest Videos

undefined

cyclone michaung : రేపు తుపానుగా మారనున్న తీవ్రవాయుగుండం..ఏపీలో భారీ వర్షాలు..

2018 ఎన్నికలతో పోలిస్తే 2023లో జరిగిన పోలింగ్ శాతం కొంత తగ్గిందని చెప్పుకొచ్చారు. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఓట్ల లెక్కింపును  ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ లెక్కింపులో మొదట పోస్టల్ బ్యాలెట్ లను లెక్కిస్తామని.. లెక్కింపు పూర్తయిన తర్వాతే ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తామని తెలిపారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ లో సంఖ్య పెరిగింది. మొత్తంగా 1,80,000  పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాల్సి ఉంటుంది.

ఇది పూర్తయిన తర్వాత 8:30 నుంచి ఈవీఎంలలో ఓట్ల లెక్కింపును మొదలు పెడతారు. అరగంటలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తిగా కాకపోతే, పోస్టల్ బ్యాలెట్లు,  ఈవీఎంలలో లెక్కింపులను సమాంతరంగా మొదలుపెడతారు. కౌంటింగ్ పరిశీలకుల సమక్షంలోనే జరుగుతుంది. కౌంటింగ్ విషయంలో వారి ఆమోదం తర్వాతే ఫలితాలను వెల్లడిస్తారు. కౌంటింగ్ లో ఎలాంటి సమస్యలు, అభ్యంతరాలు తలెత్తకుండా ప్రతి టేబుల్ కు ఒక సూక్ష్మ పరిశీలకుడిని ఎలక్షన్ కమిషన్ నియమించింది.

దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు తెలుపుతూ… ఎన్నికల్లో ఎక్కడ రిగ్గింగ్ జరగలేదని తెలిపారు. కొన్నిచోట్ల సాయంత్రం ఐదు గంటల లోపు  క్యూ లైన్ లో నిలుచున్న అభ్యర్థులకు..ఎన్నికల నిబంధన మేరకు ఓటు వేయడానికి అవకాశం ఇవ్వడంతో.. పోలింగ్ రాత్రి 9:30 గంటల వరకు జరిగిందన్నారు. 79 నియోజకవర్గాల్లో 75 శాతానికి మించి పోలింగ్ నమోదయిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా కేంద్రాల్లో సాయంత్రం నాలుగు గంటల తర్వాత పోలింగ్ పెరిగిందని చెప్పుకొచ్చారు. ఈసారి ఎన్నికల ప్రవర్తన నియమాలని ఉల్లంఘించిన కేసులు ఎక్కువ స్థాయిలో నమోదయ్యాయని తెలిపారు. 2018 ఎన్నికల్లో 2,400 కేసును నమోదు అయితే, ఈసారి 13వేల వరకు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కింద ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు.

click me!