తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది.
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మూడేసి స్థానాల్లో రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నాడు షెడ్యూల్ విడుదల చేసింది. దేశంలోని 15 రాష్ట్రాల్లో 56 స్థానాల్లో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది.
తెలంగాణ నుండి భారత రాష్ట్ర సమితికి చెందిన జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుండి బీజేపీకి చెందిన సీఎం రమేష్, తెలుగు దేశం పార్టీకి చెందిన కనకమేడల రవీంద్రకుమార్, వైఎస్ఆర్‌సీపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల పదవీకాలం ముగియనుంది. దీంతో రాజ్యసభ ఎన్నికలు అనివార్యమయ్యాయి.
రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 15న నామినేషన్ల దాఖలుకు చివరి తేది. ఫిబ్రవరి 20న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేది. ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 29వ తేదీ లోపుగా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో 56 మంది రిటైర్ కానున్నారు. ఆ స్థానాలను భర్తీ చేయడానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ ఛత్తీస్ ఘడ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల నుండి రాజ్యసభ సభ్యులు రిటైర్ కానున్నారు.