Top Stories: సీఎంతో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ, జగన్‌ వర్సెస్ సొంత జిల్లా ఎమ్మెల్యే, 9వ సారి నితీశ్ ప్రమాణం

By Mahesh K  |  First Published Jan 29, 2024, 6:12 AM IST

సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ భేటీ అయ్యారు. ఆయన పార్టీ మారుతున్నారా? అనే వదంతులు రావడంతో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే స్వయంగా వివరణ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి రెండో వారంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం.. అవే సమావేశాల్లో కుల గణనకు ప్రతిపాదనలు ప్రవేశపెట్టనున్నది. బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ఆదివారం తొమ్మిదో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
 


Top Stories: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం మరోసారి తెరమీదికి వచ్చింది. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ ప్రచారంపై ప్రకాశ్ గౌడ్ స్పందించారు. తాను పార్టీ మారబోవడం లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని భూ సమస్యలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్టు చెప్పారు. ఇటీవలే మెదక్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ఈ నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది.

మళ్లీ వీఆర్వో, వీఆర్ఏలు?

Latest Videos

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దారుల సంఘం, డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రి ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి ఒక వ్యక్తి ఉండేలా చూస్తామని, అదే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామని, గతంలో ప్రతి గ్రామంలో వీఆర్ఏ, వీఆర్వోలు ఉండేవారని గుర్తు చేశారు. దీంతో వీఆర్వో, వీఆర్ఏలను పునరుద్ధరించనున్నారా? అనే సంశయాలు వెలువడ్డాయి. భూ అక్రమాలు బయటపడకుండా, ధరణి అనే తప్పుల తడక పోర్టల్ తెచ్చి వీఆర్వో, వీఆర్ఏ పదవులను కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిందని పొంగులేటి తీవ్ర ఆరోపణలు చేశారు.

Also Read: Nitish Kumar: 5 కంటే ఎక్కువ సార్లు సీఎం అయినవారి జాబితా ఇదే

బడ్జెట్ సమావేశాల్లోనే కుల గణనకు తీర్మానం!

తెలంగాణ కుల జనగణనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. వీలైనంత త్వరగా కుల గణన చేపట్టి పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఫిబ్రవరి రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే కుల గణనకు తీర్మానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్నది. ఇందుకు బిల్లు ముసాయిదా తయారీ బాధ్యతను, ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బాధ్యతను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీఎం రేవంత్ అప్పగించినట్టు సమాచారం. కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వాగతించారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసించారు.

Also Read: YSRCP: వైసీపీ ఐదో జాబితాపై తీవ్ర కసరత్తు.. మరో రెండు రోజుల్లో జాబితా ప్రకటన!

కేటీఆర్ కాలిగోటికి సరిపోడు: రేవంత్ పై కేటీఆర్ ఫైర్

సిరిసిల్లలో బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నాడని, ఆయనతో అయ్యేదేమీ లేదని అన్నారు. కేసీఆర్‌ను తొక్కుతాం, బొంద పెడతాం.. అంటూ మాట్లాడిన పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్‌తోనే ఏమీ కాలేదని పేర్కొన్నారు. అలాంటిది ఈ బుడ్డర్ ఖాన్‌తో ఏం అవుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి గురువు కూడా గతంలో ఇలానే మాట్లాడాడని, కానీ, ఆయనతో కూడా ఏమీ కాలేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోడని పేర్కొన్నారు. తాను సిరిసిల్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సిరిసిల్లను వదిలివెళ్లిపోతానని వస్తున్న వదంతులను నమ్మరాదని స్పష్టం చేశారు.

Also Read: నల్గొండలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్‌డెడ్.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం

జగన్ వర్సెస్ సొంత ఎమ్మెల్యే?

సీఎం జగన్ తన సొంత కడప జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యేను రెండ్రోజుల క్రితం తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకున్నాడని, అక్కడ వారిద్దరి మధ్య ఢీ అంటే ఢీ అన్నట్టుగా సంభాషణ జరిగిందని ఓ ప్రముఖ దినపత్రిక కథనం ప్రచురించింది. అభ్యర్థుల మార్పు చేర్పులపై సంభాషణ జరుగుతుండగా వీరిద్దరి మధ్య నీ పరిస్థితేం బాలేదంటే.. నీదే బాలేదనే మాటలు వచ్చాయని పేర్కొంది. నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే పరిస్థితేమీ బాగాలేదని, సర్వేలో బాగా వ్యతిరేకత ఉన్నట్టు తేలిందని సీఎం ఆయనకు వివరించే ప్రయత్నం చేశాడు. అయితే, సీఎం పరిస్థితి మాత్రం బాగున్నదా? అంటూ సదరు ఎమ్మెల్యే ఎదురు ప్రశ్నించినట్టు ఆ కథనం పేర్కొంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన జగన్‌, ఆ ఎమ్మెల్యేకు అక్కడే ఉన్న మరో సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి సర్దిచెప్పినట్టు సమాచారం.

Also Read: Janasena: ఎన్నికల రంగంలోకి జనసేనాని.. అనకాపల్లి నుంచి ప్రచారం షురూ!

తొమ్మిదోసారీ సీఎం ఆయనే

2000లో తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నితీశ్ కుమార్ అప్పటి నుంచి రాష్ట్రంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినా.. ఏ కూటమికి ఎక్కువ సీట్లు ఉన్నా.. సీఎం సీటు మాత్రం నాదే అన్నట్టుగా నడుచుకుంటున్నారు. తాజాగా ఆర్జేడీ, కాంగ్రెస్‌లకు బై చెప్పి మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరి తొమ్మిదో సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. నిన్న ఉదయం కాంగ్రెస్ కూటమిలో ఉన్న నితీశ్ కుమార్, సాయంత్రానికి ఎన్డీయే ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా మారారు. ఇద్దరు బీజేపీ నేతలు డిప్యూటీ సీఎంగా, పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం తీసుకున్నారు. ఈ పరిణామాలపై ప్రతిపక్ష నేతలు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు నితీశ్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశాయి. ఈ ప్రభుత్వం లోక్ సభ ఎన్నికల వరకేనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా అంచనా కట్టాడు.

click me!