
తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి శశాంక్ గోయల్‌ను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి సీఈవో కోసం ముగ్గురు ఐఏఎస్‌ల పేర్లను సీఈసీకి రాష్ట్ర ప్రభుత్వం పంపినట్లుగా తెలుస్తోంది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో ఏ క్షణంలో అయినా సీఈవో శశాంక్ గోయల్‌ను రిలీవ్ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. శశాంక్ గోయల్‌లను కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తూ జనవరి 18న ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఇన్‌ఛార్జీ సీఈవోగా ప్రస్తుతం అడిషనల్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బుద్ధ ప్రకాష్ నియమితులయ్యారు. 1990 బ్యాచ్ ఏపీ కేడర్‌కు చెందిన డాక్టర్ శశాంక్ గోయల్ గతేడాది మేలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన కార్మిక, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా సేవలందించారు. అలాగే ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేశారు.
కాగా.. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ 2018 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు ప్రముఖ న్యూస్ ఛానెల్ ఏబీఎన్‌లో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారితో కేంద్ర ఎన్నికల కమీషన్ (election commission of india) నివేదిక తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. నివేదిక పంపిన కొద్దిరోజులకే సీఈవో శశాంక్ గోయల్ (shashank goyal) కేంద్రానికి బదిలీపై వెళ్లడం గమనార్హం. ట్యాంపరింగ్ జరిగిన విషయం నిజమేనంటూ.. శశాంక్ గోయల్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. నివేదిక ఆధారంగా ట్యాంపరింగ్ ఆరోపణలపై అంతర్గతంగా సాంకేతిక బృందంతో ఈసీ విచారణ జరిపిస్తోన్నట్లుగా తెలుస్తోంది. ట్యాంపరింగ్‌ను టెక్నికల్ బృందం ధ్రువీకరిస్తే.. ఐపీసీ, ఐటీ చట్టాల ప్రకారం మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై చర్యలు తీసుకునే అవకాశం వుందని ఏబీఎన్ తన కథనంలో పేర్కొంది.
గతేడాది ఆగస్టులో ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన సీఈసీ ఇప్పుడు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. 14.11.2018న మహబూబ్‌నగర్ అసెంబ్లీ సీటుకు (mahabubnagar assembly constituency) శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈసీ నిబంధనల ప్రకారం ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులతో కూడిన వివరాలతో 14.12.2018న అఫిడవిట్‌ను సమర్పించారు శ్రీనివాస్ గౌడ్. ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ను వెంటనే తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది ఈసీ. అయితే పోలింగ్ పూర్తయి , ఫలితాలు రావడానికి రెండు రోజుల మందు వెబ్‌సైట్‌లో కొత్త అఫిడవిట్ ప్రత్యక్షమైనట్లు ఏబీఎన్ తెలిపింది. 19.11.2018వ తేదీతో కొత్త అఫిడవిట్ ఎన్నికల కమీషన్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైంది. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు సవరించిన అఫిడవిట్‌ను.. తెలంగాణ ఈసీ అధికారులతో కుమ్మక్కై మంత్రి శ్రీనివాస్ గౌడ్ అప్‌లోడ్ చేయించినట్లు ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే తనపై వస్తున్న ఆరోపణలపై మంత్రి స్పందించారు. తనపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆమోదించిన తుది అఫిడవిట్‌నే పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. నామినేషన్లు వేశాక అఫిడవిట్ మార్చడం సాధ్యమేనా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల టైమ్ నుంచే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అసలు వాస్తవాలు తెలుసుకోకుండా ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారని, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని అన్నారు. Delhi High Coutలో 2021 డిసెంబర్‌లో కేసు డిస్మిస్ అయిందని అన్నారు. ఈ వ్యవహారం వెనుక ఏ రాజకీయ శక్తులు ఉన్నాయో ఆరా తీస్తామన్నారు. ఇతరులు వేసిన పిటిషన్ లు తెలంగాణ హైకోర్టు లో విచారణలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయం గమనించకుండా తనపై బురద జల్లుతున్నారు. ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కొలేని వారే ఈ ఆరోపణలు చేస్తున్నారని.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతామని చెప్పారు. ఆధారాలతో సహా పేర్లు వెల్లడించి భరతం పడతానని హెచ్చరించారు.