
బ్రైట్ కామ్ సంస్థల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు ముగిశాయి. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘన కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని ఐదు చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం తెలిపింది. ఈ సోదాల్లో రూ. 3.30 కోట్ల నగదుతో పాటు.. రూ. 9.30 కోట్లు విలువ చేసే బంగారం, ఇతర వస్తువులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బ్రైట్‌కామ్ గ్రూప్ లిమిటెడ్ కార్యాలయాల్లో, కంపెనీ సీఈవో ఎం సురేష్ రెడ్డి, సీఎఫ్‌వో ఎస్‌ఎల్ఎన్ రాజు నివాసాలు, కంపెనీ ఆడిటర్ పి మురళీ మోహనరావు ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. విదేశాల్లోని అనుబంధ సంస్థల ద్వారా బ్రైట్‌కామ్ గ్రూప్ రూ. 868.30 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి ఫ్రాడ్ జరిగినట్టుగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నిర్వహిస్తున్న దర్యాప్తు ఆధారంగా ఈడీ ఫెమా ఉల్లంఘనకు సంబంధించిన విచారణను ప్రారంభించింది.
ఈడీ విచారణలో బ్రైట్‌కామ్ గ్రూప్ లిమిటెడ్.. ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు వెల్లడైంది. అనుబంధ కంపెనీలకు నిధులు మల్లించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. నకిలీ పత్రాలు సృష్టించి సెబీ నుంచి సంస్థ లబ్ధి పొందింది. రూ.300 కోట్ల రూపాయల నిధులను అనుబంధ కంపెనీలకు బ్రైట్ కామ్ మళ్లించింది.
ఈ సోదాల సమయంలో వివిధ నేరారోపణ పత్రాలు, డిజిటల్ పరికరాలు కూడా ఈడీ అధికారులు రికవరీ చేశారు. మురళీ మోహనరావు నివాసంలో లెక్కల్లో చూపని నగదు, బంగారు ఆభరణాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.