మోడీ 9 ఏళ్ల పాలనలో విపక్షాలపైనే ఈడీ, సీబీఐ కేసులు నమోదౌతున్నాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
హైదరాబాద్: కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మ, ఈడీ తొలుబొమ్మగా మారిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. నీతి లేని పాలనకు కేంద్రం పర్యాయపదంగా నిలిచిందని ఆయన చెప్పారు. ప్రతిపక్షం అంటే చీల్చి చెండాడేందుకు ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారని ఆయన మోడీపై విమర్శలు చేశారు. వేట కుక్కల మాదిరిగా దర్యాప్తు సంస్థలను విపక్షాలపైకి ఉసిగొల్పుతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ఈడీ, సీబీఐలను బీజేపీ అనుబంధ సంఘాలుగా కేటీఆర్ పేర్కొన్నారు. 95 శాతం ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు విపక్షాలపై నమోదైన విషయం నిజం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేతలపై ఒక్క కేసైనా పెట్టారా అని ఆయన అడిగారు.
గౌతమ్ అదానీ మోడీ బినామీ కాదా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయమై చిన్న పిల్లాడిని అడిగిన సమాధానం చెబుతాడన్నారు. హిండెన్ బర్గ్ నివేదిక ఇచ్చినా కూడా అదానీపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అదానీకి చెందిన ముద్రా పోర్టులో హెరాయిన్ దొరికిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ, ఎస్‌బీఐ లకు చెందిన
13 లక్షల కోట్లు ఆవిరైనట్టుగా కేటీఆర్ చెప్పారు. ఈ విషయమై మోడీ, నిర్మలా సీతారామన్ ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీ కోసం కేంద్ర ప్రభుత్వం పాలసీలు మార్చలేదా ఆయన ప్రశ్నించారు. మోడీ, అదానీ చీకటి స్నేహం ప్రపంచానికి తెలుసునన్నారు.
ఆరు ఎయిర్ పోర్టులు అదానీకి నిబంధనలకు విరుద్దంగా కేంద్రం కట్టబెట్టిందని కాగ్ నివేదిక ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. మోడీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని కేటీఆర్ చెప్పారు.
గతంలో టీడీపీలో ఉన్న సుజనాచౌదరిపై కేసు విషయమై ఈడీ అధికారులు ట్వీట్ చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఆ తర్వాత సుజనా చౌదరి , సీఎం రమేష్ లు బీజేపీలో చేరారన్నారు. కానీ ఈ కేసులు ఇప్పుడేమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. దొంగసొమ్ముతో ప్రభుత్వాలను కూల్చివేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 9 ఏళ్ల పాలనలో 9 ప్రభుత్వాలను కూల్చలేదా అని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
also read:మోడీ సమన్లు: కవితకు ఈడీ నోటీసులపై కేటీఆర్
గుజరాత్ లో లిక్కర్ పై బ్యాన్ ఉన్నా కూడా 42 మంది లిక్కర్ తాగి చనిపోవడం పెద్ద స్కాం అని కేటీఆర్ పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ అంటే ఒక ఇంజన్ మోడీ, మరో ఇంజన్ అదానీ అని కేటీఆర్ చెప్పారు.