
BRS leader, MLC Kalvakuntla Kavitha: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఏదుర్కొంటున్న బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. పలు ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలు ఈ నిరసనలో పాల్గొంటాయని సమాచారం.
వివరాల్లోకెళ్తే.. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది. కానీ దీనికి సంబంధించి ముందడుగు పడటంలేదు. ఈ క్రమంలోనే కవిత దేశ రాజధాని ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్షకు దిగనున్నారు. ఆమె దీక్షకు ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పాలుపంచుకుంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత్ జాగృతి అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఈ నిరసనకు నేతృత్వం వహించనున్నారు.
లోక్ సభ, రాష్ట్ర శాసనసభల్లో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన ఈ బిల్లును తొలిసారిగా 1996లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత పలుమార్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందగా, 2014లో 15వ లోక్ సభ రద్దయిన తర్వాత అది రద్దయింది. అప్పటి నుంచి ఈ బిల్లు ముందుకు వెళ్లలేదు. శుక్రవారం కవిత దీక్షలో కాంగ్రెస్ తో పాటు పలు ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొంటారు. 29 రాష్ట్రాల్లోని మహిళా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలను ఈ నిరసనలో పాల్గొనాలని బీఆర్ఎస్ ఆహ్వానించింది.
మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, అకాలీదళ్, నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీ, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ, సీపీఎం, సీపీఐలు ఈ నిరసనలో పాల్గొననున్నాయని సమాచారం. కవిత నేతృత్వంలోని ఈ నిరసనలో అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన ఆప్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేఎంఎంతో పాటు కొందరు స్వతంత్ర ఎంపీలు కూడా పాల్గొంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కవిత ఢిల్లీకి చేరుకున్నారు.
అయితే, దీక్షకు ముందు కవితకు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తమముందు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇవ్వడంతో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాజకీయ కక్షతో బీజేపీ ప్రతిపక్ష నాయకులపైకి దర్యాప్తు సంస్థలను పంపుతోందని బీఆర్ఎస్ ఆరోపించింది. కవిత స్పందిస్తూ.. తెలంగాణ ఎప్పటికీ తలవంచదని పేర్కొంటూ విచారణకు సహకరిస్తానని తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే కవితకు ఈడీ నోటీసులు పంపారని బీఆర్ఎస్ విమర్శించింది.